రోజూ నష్టమే: ఐఓసి
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద పెట్రో ఉత్పత్తుల విక్రయ సంస్థ ఇండియన ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) రోజువారీ అమ్మకాలపై సుమారు 107 కోట్ల రూపాయల వరకు నష్టపోతోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ విక్రయాలను తక్కువ ధరలకు విక్రయించడం వల్లే ఆ సంస్థకు నష్టం వాటిల్లుతోంది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకుగాను ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన పరహారం కోసం ఐఓసీ ఎదురుచూస్తోంది. ఐఓసీతో పాటుగా అనుబంధ సంస్థలైన హిందుస్తాన్ పెట్రోలియం, బారత్ పెట్రోలియం లు కూడా రోజువారీ అమ్మకాలపై నష్టాలు చవిచూస్తున్నాయని ఐఓసీ చైర్మన్ బి ఎం బన్సాల్ వెల్లడించారు.
పెట్రోల్ పై 4.97, డీజిల్ పై 3.27, కిరోసిన్ పై16.91, గ్యాస్ పై 267 రూపాయల మేరకు రోజువారీ నష్టం వస్తోందని ఆయన వివరించారు. ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల ఎక్సైజ్, కష్టమ్స్ సుంకాలను పెంచిన తరువాతే తమకు ఈమేర నష్టం వాటిల్లుతోందని బన్సాల్ చెప్పారు. పెట్రోలియం పరిశ్రమ యావత్తూ రోజుకూ 196 కోట్ల రూపాయల నష్టాన్ని భరిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. 2009-10 సంవత్సరాలకు గాను ఐఓసీ, బిపిసిఎల్, హెచ్ పిసిఎల్ లకు కలిపి 47, 400 కోట్లు ఆదాయం రాకుండా పోయిందన్నారు.
తమకు వస్తున్న పెట్రో నష్టాలపై కేంద్ర ప్రభుత్వం, ఓఎన్ జీసీ వంటి సంస్థలు గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. కిరోసిన్, ఎల్పీజీలను తక్కువ ధరలకు విక్రయించడం వల్ల 31, 574 కోట్ల రూపాయలను నష్టం వచ్చిందని బన్సాల్ వెల్లడించారు. అయితే ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ మేరకు 11, 845 కోట్ల రూపాయలను తమకు చెల్లించినప్పటికీ, ఇంకా 19,729 కోట్లు రూపాయల బకాయి ఉందన్నారు. ఐఓసీకి రోజువారీ నష్టాలు వస్తున్నందున కొత్త ప్రాజెక్టులను చేపట్టలేకపోతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.
News Posted: 3 March, 2010
|