టాప్ టెన్ లో ముఖేష్
న్యూయార్క్ : ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితా టాప్ టెన్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్ స్థానం సంపాదించారు. 2010 సంవత్సరం బిలియనీర్ల జాబితాను ఫోర్బ్స్ పత్రిక బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో 29 బిలియన్ డాలర్ల ఆస్థితో ముఖేష్ అంబానీ నాలుగో స్థానాన్ని పొందగా, 28.7 బిలియన్ డాలర్ల ఆస్తితో లక్ష్మీమిట్టల్ ఐదో స్థానాన్ని సాధించారు.
కాగా, ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితా బారతీయులకు చేదు వార్తనే మిగిల్చింది. భారత్ లో బిలియనీర్లు తగ్గారని ఫోర్బ్స్ ప్రకటించింది. 29 మంది భారతీయులు ఈ ఏడాది బిలియనీర్ల హోదాను కోల్పోయారని ఫోర్బ్స్ వెల్లడించింది. గతంలో ఆసియాలో అత్యధిక ధనవంతులున్న దేశంగా నిలిచిన భారత్ ఈ సారి ఆ స్థానాన్ని చైనాకు అప్పగించాల్సివ వచ్చింది. అలాగే భారీ స్థాయిలో నష్టాలు మూటగట్టుకున్న బిలియనీర్లలో భారతదేశానికే చెందిన అనిల్ అంబానీ నిలిచారు. గత ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్ సుమారు 44 శాతం పడిపోవడం ప్రధాన కారణమని ఫోర్బ్స్ అంచనా వేసింది. మరోవైపు రూపాయి విలువ కూడా18 శాతం తగ్గడంతో పలువురు ప్రముఖులు బిలియనీర్ల హోదాను కోల్పోయినట్లు వెల్లడించింది. అంతేగాక ఆసియా ఖండంలో అత్యధికంగా బిలియనీర్లు ఉన్న దేశంగా గత ఏడాది భారత్ నిలవగా, ఈ సారి ఆ స్థానాన్ని కూడా కోల్పోయింది. ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న దేశంగా చైనా నిలిచింది. భారత్ ను వెనక్కి నెట్టేసి చైనా ముందు వరుసలోకి వచ్చింది.
ప్రపంచ బిలియనీర్లలో ప్రథమస్థానంలో ఉంటూ వచ్చిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తాజాగా ఆ స్థానాన్ని కోల్పోయారు. మెక్సికన్ టెలికామ్ టైకూన్ కార్లోస్ స్లిమ్ హేలూ ఈ ఏడాది ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 53.5 బిలియన్ల ఆస్తులతో ఆయన బిల్ గేట్స్ ను జాబితాలో రెండో స్థానంలోకి నెట్టివేశారు. 53 బిలియన్లతో బిల్ గేట్స్ రెండవ స్థానంలో నిలిచారు. 47 బిలియన్లతో ప్రముఖ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాలను ముఖేష్, మిట్టల్ సాధించుకున్నారు.
గత ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించిన అనిల్ అంబానీ ఈ ఏడాది భారీ మొత్తంలో నష్టపోయారని ఫోర్బ్స్ వెల్లడించింది. రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ పవర్, రిలయన్స్ క్యాపిటల్ షేర్లు భారీగా పడిపోవడంతో అనిల్ 32 బిలియన్ల మేరకు నష్టాలు మూటగట్టుకున్నారని ఫోర్బ్స్ తెలిపింది.
News Posted: 10 March, 2010
|