అమ్మకానికి సెక్స్ కామ్
లండన్ : చరిత్రలో అత్యంత ఖరీదైన వాటిలో ఒకటిగా పేర్కొంటుండే వెబ్ డొమైన్ సెక్స్ డాట్ కామ్ ఇప్పుడు వేలం కాబోతున్నది. ప్రారంభ పాట (బిడ్) ఒక మిలియన్ డాలర్లు. అమెరికా న్యూజెర్సీలోని రుణసహాయ సంస్థ డిఒఎం పార్ట్ నర్స్ ఎల్ఎల్ సి అండతో ఈ వెబ్ సైట్ పేరును 2006లో 14 మిలియన్ డాలర్ రికార్డు ధరకు కొనుగోలు చేశారు. సెక్స్.కామ్ రికార్డు టైటిల్ ను ఇన్స్యూర్.కామ్ పూర్వపక్షం చేసింది. ఇది క్రితం సంవత్సరం 16 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అయితే, ఆ ఇంటర్నెట్ సంస్థ యజమాని ఎస్కామ్ తన రుణాన్ని చెల్లించలేకపోవడంతో రుణదాత సంస్థ దానిని ముందుగానే మూసివేస్తున్నది. మార్చి 18న ప్రారంభం కానున్న బిడ్డింగ్ ఒక మిలియన్ డాలర్లు లేదా 6.70 లక్షల పౌండ్ల రేటుతో మొదలవుతుంది.
సాధారణ డొమైన్ పేర్ల కోసం జరిగే వేలంపాటలు ఇంటర్నెట్ సంస్థలకు ఒక సదవకాశంగా పరిగణిస్తుంటారు. ఇంటర్నెట్ తొలి రోజులలో తెలివైన మదుపరులు ప్రాథమిక ధరలకు పలు డొమైన్ పేర్లను కొనుగోలు చేసి ఆతరువాత భారీ లాభాలకు విక్రయించారు. 2008లో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.పిట్జా.కామ్ కోసం నిర్వహించిన వేలంపాటలో 2.5 మిలియన్ డాలర్లకు మించి బిడ్లు వచ్చాయి. ఇజ్రేల్.కామ్ ను అదే సంవత్సరం 5.88 మిలియన్ డాలర్లకు విక్రయించారు.
అయితే, సెక్స్.కామ్ చరిత్ర ఆవిర్భావం నుంచి విభిన్న రీతుల్లో సాగుతూ వచ్చింది. 1994లో డేటింగ్ వెబ్ సైట్ 'మ్యాచ్.కామ్'ను కనుగొన్న వ్యాపారవేత్త గారీ క్రెమెన్ తొలుత దీనిని కొనుగోలు చేశారు. రెండు సంవత్సరాల తరువాత ఒక కుంభకోణం బయటపడడంతో దీని యాజమాన్యాన్ని స్టీఫెన్ కోహెన్ కు బదలాయించారు. యాజమాన్యంపై ఐదు సంవత్సరాల పాటు న్యాయ పోరాటానికి ఇది దారి తీసింది. కాలిఫోర్నియాలో న్యాయమూర్తి ఒకరు క్రెమెన్ కు 65 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని మంజూరు చేసి, సెక్స్.కామ్ హక్కులను తిరిగి దత్తం చేశారు. క్రెమెన్ చివరకు ఈ సైట్ ను 2006లో అమ్మకానికి పెట్టగా ఎస్కామ్ 14 మిలియన్ డాలర్లు చెల్లించింది.
ఈ సైట్ ఒక దశలో రోజుకు 15 వేల డాలర్ల మేరకు ఆదాయాన్ని సంపాదించిందని చార్లెస్ కారెయాన్ అనే న్యాయవాది తెలియజేశారు. డొమైన్ చట్టపరమైన సమస్యలపై ఆయన ఒకసారి ఒక వ్యాసం రాశారు. ఇప్పుడు ఈ వేలంపాటకు ఆధ్వర్యం వహిస్తున్న మాల్ట్ జ్ ఆక్షన్స్ సంస్థలో వేలం నిర్వాహకుడు రిచర్డ్ మాల్ట్ జ్ ఈ డొమైన్ పై గణనీయ స్థాయిలో ఆసక్తి వ్యక్తమవుతున్నదని తెలియజేశారు.
News Posted: 11 March, 2010
|