'బడ్జెట్ లైవ్' చూసిన ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇద్దరు సహాయకులతో కలసి సోమవారం తన ప్రభుత్వ చివరి బడ్జెట్ సమర్పణను టివిలో తిలకించారు. ఈ మధ్యంతర బడ్జెట్ సమర్పణను 'అసలు లెక్కలోకి రాని ప్రక్రియ'గా, 'వనీలా బడ్జెట్'గా పరిశ్రమ అభివర్ణించినప్పుడు ఆయన నొచ్చుకున్నా కూడా ఆయన ఆ చిహ్నాలను బయటపడనివ్వలేదు. 'ఆర్థిక వ్యవస్థను గరిష్ఠ వృద్ధి దిశగా తీసుకుపోవలసిన ఆవశ్యకతకు, ఎన్నికల ముందు బడ్జెట్ కు సంబంధించిన రాజ్యాంగపరమైన అవరోధాలకు మధ్య చక్కని సమతూకం పాటించినట్టిది' అని ఈ మధ్యంతర బడ్జెట్ గురించి డాక్టర్ మన్మోహన్ సింగ్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బైపాస్ సర్జరీ అనంతరం ఇంటిలోనే ఉండి కోలుకుంటున్న కారణంగా పార్లమెంట్ కు హాజరు కాలేకపోయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ బడ్జెట్ కు ప్రణబ్ ముఖర్జీని అభినందించారు. సంక్లిష్ట ఆర్థిక పరిస్థితికి తగినట్లుగా ఆయన స్పందించారని డాక్టర్ సింగ్ కొనియాడారు. దీనిని 'ప్రజల బడ్జెట్'గా ప్రధాని అభివర్ణించారు. 'వివిధ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలకు ఉద్దీపనను కొనసాగించడం వల్ల అన్ని వర్గాలకు, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ (సామాన్యుని)కి ఉపశమనం లభించగలదనడంలో నాకేమాత్రం సందేహం లేదు' అని డాక్టర్ సింగ్ చెప్పారు.
పరిశ్రమకు, ఎగుమతి రంగానికి ఇంతకుముందు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ వల్ల ప్రయోజనాలు ఇంకా లభిస్తూనే ఉంటాయని, మౌలిక వసతుల కల్పన, ఉపాధి కల్పన రంగాలపై పెట్టుబడులు పెరుగుతాయని, అదే సమయంలో సామాన్యుడు తన ప్రణాళికా రచన ప్రక్రియకు కేంద్ర బిందువుగా ఉంటాడని కూడా అయన చెప్పారు. ఆర్థిక మాంద్యం, సత్యం కుంభకోణం గురించి డాక్టర్ సింగ్ కలవరం చెందుతూ పరిశ్రమకు ద్రవ్య సరఫరా ఆవశ్యకత ఉందని భావిస్తున్నప్పటికీ, సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు, 'ఆమ్ ఆద్మీ' గురించి ఆలోచించకుండా ఉండలేరని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికలు ఇటు ఆయనకూ, అటు కాంగ్రెస్ కు కూడా అత్యంత ముఖ్యమైనవి కదా!
Pages: 1 -2- -3- News Posted: 17 February, 2009
|