రెక్కవిప్పిన నిరుద్యోగం
మనీలా(ఫిలిప్పైన్స్): ఆసియాలో నిరుద్యోగం రెక్కవిప్పుతోంది. ఒక్క 2009 సంవత్సరంలోనే దాదాపు 72 లక్షల మంది నిరుద్యోగులు కొత్తగా ఉనికిలోకి వస్తారని అంతర్జాతీయ కార్మిక సంస్థ బుధవారంనాడు తెలిపింది. ప్రపంచ మహా సంక్షోభం కారణంగా ఆసియా ప్రాంత నిరుద్యోగం 5.1 శాతం పెరుగనుందని ఐఎల్ఓ నివేదిక తెలిపింది. దాంతో 2009లో ఆసియా ప్రాంత నిరుద్యోగుల జనాభా 9.7 కోట్లకు చేరుకుంటుంది. ఈ మధ్యకాలంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మొనగాడుగా నిలిచిన ఈ ప్రాంతం జనాభాలోని మూడవ వంతు ప్రజలు ఒక్క అమెరికా డాలరు కంటే తక్కువ దినసరి ఆదాయంతో బతుకులీడుస్తున్నారు. నిరుడు, నిరుద్యోగ రేటు 4.8 శాతంగా ఉండేది.
ఐఎల్ఓ మరో నివేదికలో ఆసియా నిరుద్యోగ జనాభా 11.3 కోట్లకు పెరగుతుందని తెలిపింది. గత ఏడాది కంటే ఈ ఏడాదిలో 2.23 కోట్ల మంది నిరుద్యోగులవుతారని ఆ నివేదిక తెలిపింది. ఆసియాలో పెరుగుతున్న కార్మిక శక్తిని బట్టి ఈ ఏడాది 5.1కోట్ల కొత్త జాబ్స్ అవసరమవుతాయి. భారత దేశానికి 2.3 కోట్లు, చైనాకు 1.09 కోట్లు, ఇండోనేషియాకు 36లక్షల కొత్త జాబ్స్ అవసరమవుతాయని ఐఎల్ఓ నివేదిక పేర్కొంది. 2010 నాటికి శ్రామిక శక్తి అత్యధికంగా పెరిగే దేశాల్లో పాకిస్తాన్ వద్ద 6.1శాతం, కంబోడియా వద్ద 4.9 శాతం, ఫిలిప్పైన్స్ వద్ద 4.9 శాతంగా ఆ నివేదిక తెలిపింది. ఆసియా ప్రాంత అవసరాలకు తగ్గట్లు కొత్త ఉద్యోగాలు రావడం అసాధ్యమని ఆ నివేదిక వివరించింది. 2008 మూడవ త్రైమాసికం నుండి ఈ ప్రాంత వలస కార్మికుల ప్రయాణాలు మందగించాయి.
Pages: 1 -2- News Posted: 18 February, 2009
|