అమర్ సింగ్ చేతికి 'షాట్ గన్'?
పాట్నా: పాట్నా సాహెబ్ లోక్ సభ టిక్కెట్ కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి)నాయకుడు శత్రుఘ్న సిన్హా (షాట్ గన్)కు, పార్టీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ కు మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో శత్రుఘ్న సిన్హా గురువారం పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్, నటుడు సంజయ్ దత్ తో కలసి వేదిక పంచుకోవడం రాజకీయ వర్గాలలో సంచలనం రేపింది. బాలీవుడ్ హీరోలకు గాలం వేయడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్న అమర్ సింగ్ బిజెపి నుంచి 'షాట్ గన్'ను ఎగరేసుకుపోయారా? అన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది.
అయితే కేవలం 'కేన్సర్ రోగుల సంక్షేమం' కోసం ఏర్పాటైన సమావేశం మాత్రమే అని శత్రుఘ్న సిన్హా చెప్పవచ్చు. కాని ఆయన చూపిన ఈ తెగువను పాట్నా సాహెబ్ టిక్కెట్ తనకే ఇవ్వాలని లేకపోతే కల్యాణ్ సింగ్ ఉదంతం పునరావృతం కాగలదని షాట్ గన్ పరోక్షంగా సూచిస్తూ పార్టీపై ఒత్తిడి తీసుకురావడానికి ఇది ఒక 'ఎత్తుగడ'గా పరిశీలకులు భావిస్తున్నారు.
శత్రుఘ్న సిన్హా క్రితం వారం సంజయ్ దత్, మాన్యతల ప్రథమ వివాహ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఒక ప్రతినిధి సమాచారం ప్రకారం, సంజయ్ దత్, శత్రుఘ్న సిన్హా ఇటీవల ముంబై-ఢిల్లీ విమానంలో కలుసుకుని చాలాసేపు మాట్లాడుకున్నారు. పైగా అమర్ సింగ్ తో శత్రుఘ్న సిన్హాకు గల స్నేహం గురించి అందరికీ తెలుసు. బీహారీ బాబు (శత్రుఘ్న సిన్హా) కోసం ఎస్ పి తలుపులు తెరిచే ఉంటాయని అమర్ సింగ్ ఇటీవలే బాహాటంగా ప్రకటించారు కూడా. ఆదాయానికి ఆస్తుల కేసులో సమాజ్ వాది పార్టీ అధిపతి ములాయం సింగ్ యాదవ్ ను శత్రుఘ్న సిన్హా బహిరంగంగా సమర్థించడమే కాకుండా 'అధికార యుపిఎ చెప్పినట్లు నడుచుకుంటున్నందుకు' సిబిఐని తీవ్రంగా దుయ్యబట్టారు.
Pages: 1 -2- News Posted: 20 February, 2009
|