లక్నో: లోక్ సభ ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) అభ్యర్థిగా లక్నో నుంచి రాజకీయ అరంగేట్రం చేస్తున్న 'మున్నా భాయ్' సంజయ్ దత్ కు మరొక భాయ్ తోడు ఉన్నారు. ఈ భాయ్ సిసలైన వ్యక్తే. బబ్లూ శ్రీవాత్సవగా అందరికీ తెలిసిన మాఫియా డాన్ ఓమ్ ప్రకాశ్ శ్రీవాత్సవ ఇప్పుడు రాజకీయ నాయకుడు కావాలని ఆకాంక్షిస్తున్నాడు. రాజకీయ నాయకుడుగా మారిన మాఫియా డాన్ అనే పేరు కోసం బబ్లూ చూస్తున్నట్లున్నది.
'భాయ్' పేరే కాకుండా వారిద్దరికీ మరింత సారూప్యత కూడా ఉంది లేదా ఆ విషయంలో మున్నాభాయ్ కన్నా బబ్లూ ఒక అడుగు ముందే ఉన్నట్లున్నాడు. 1993లో అలహాబాద్ లో అసిస్టెంట్ కస్టమ్స్ కలెక్టర్ ఎల్.డి. అరోరా హత్య కేసులో తన దోష నిర్థారణను నిలుపుదల (సస్పెన్షన్) చేయవలసిందని అభ్యర్థిస్తూ మాఫియా డాన్ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. కాన్పూర్ లోని టెర్రరిస్టు చర్యల నిరోధక న్యాయస్థానం 2008 అక్టోబర్ లో ఈ కేసులో బబ్లూకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
లోక్ సభ ఎన్నికల కోసం పలు జాతీయ స్థాయి పార్టీలు తనను లక్నో నుంచి పోటీ చేయించడానికి సుముఖంగా ఉన్నాయని బబ్లూ తన పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తున్నది. అతని పిటిషన్ ను సుప్రీం కోర్టు వచ్చే వారం విచారణకు చేపట్టవచ్చు. తన దోష నిర్థారణను సవాల్ చేస్తూ బబ్లూ ఇప్పటికే సుప్రీం కోర్టులో ఒక అప్పీల్ దాఖలు చేశాడు. ఆ అప్పీల్ పెండింగ్ లో ఉంది.