550 ఐపిఎస్ పోస్టులు ఖాళీ
న్యూఢిల్లీ: ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్)లో మంజూరైన సంఖ్య కన్నా 557 మంది ఆఫీసర్లు తక్కువగా ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఖాళీలలో 56 శాతం అంటే 314 మంది ఆఫీసర్లు సరాసరి రిక్రూట్ మెంట్ కోటాలో ఉన్నారని 2009 జనవరి 1 వరకు సేకరించిన గణాంక వివరాల వల్ల తెలుస్తున్నది. 'ఎందుకు ఇటువంటి పరిస్థితి తలెత్తింది? 1998, 2004 మధ్య నిర్లక్ష్యం వహించడమే ఇందుకు కారణం. అయితే, మరొక సందర్భంలో ఇందుకు సంబంధించిన వివరాలను మీకు తెలియజేస్తాను' అని కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం రెండు రోజుల క్రితం ఈ విషయం వెల్లడిస్తూ మీడియాతో చెప్పారు.
2009, 2020 మధ్య భారతీయ పోలీస్ వ్యవస్థ అవసరాలను మదింపు వేసి రిక్రూట్ మెంట్ ప్రణాళికను మే 31లోగా రూపొందించడానికి నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్ పిఎ) మాజీ డైరెక్టర్ రిటైరైన ఐపిఎస్ ఆఫీసర్ కమల్ కుమార్ ను నియమించినట్లు కూడా చిదంబరం ప్రకటించారు. హోమ్ మంత్రి వివరాలేవీ వెల్లడి చేయకపోయినప్పటికీ, ఎన్ డిఎ ప్రభుత్వం 1998 నుంచి నాలుగేళ్ళ పాటు ఏడాదికి 36 మంది ఐపిఎస్ అధికారుల నియామకాన్ని మాత్రమే ఆమోదించిందని తెలుస్తున్నది. అంతకుముందు ప్రతి ఏడాది 85 మంది ఐపిఎస్ అధికారులను నియమించాలని ప్రతిపాదించారు. ఈ ఒక్క కారణంగానే నాలుగేళ్ళ కాలంలో 196 మంది ఐపిఎస్ ఆఫీసర్ల కొరత ఏర్పడింది.
'పదోన్నతి' పోస్టుల సంఖ్య పెరుగుదల వల్ల సరాసరి రిక్రూట్ మెంట్ పోస్టుల సంఖ్య తగ్గడం, సరాసరి రిక్రూట్ మెంట్ కోటాలో వెలితి పూడుకుపోవడం అంతకుముందు నిర్ణయాన్ని మార్చడానికి కారణమై ఉంటుందని హోమ్ మంత్రిత్వశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆ అధికారుల సమాచారం ప్రకారం, 1994, 1997 మధ్య నాలుగు సంవత్సరాలలో వరుసగా 98 మంది, 100 మంది, 96 మంది, 84 మంది ఐపిఎస్ అధికారులను నియమించారు. తదుపరి ఐదేళ్ళకు ఏటా 85 ఖాళీలను భర్తీ చేయాలని అప్పట్లో నిర్ణయించారు.
Pages: 1 -2- -3- News Posted: 2 March, 2009
|