ఇక మూడు గుర్రాల రేసు!
న్యూఢిల్లీ: తృతీయ ఫ్రంట్ ను తిరిగి ఏర్పాటు చేసినట్లు మాజీ ప్రధాని, జనతా దళ్ (ఎస్) అధ్యక్షుడు హెచ్.డి. దేవెగౌడ సోమవారం ప్రకటించడంతో 15వ లోక్ సభ కోసం పోరు కొత్త మలుపు తిరిగింది. రెండు గుర్రాల పోటీ కాస్తా మూడు కూటముల మధ్య పోటీగా మారింది. ఒక కూటమికి కాంగ్రెస్, రెండవ కూటమికి భారతీయ జనతా పార్టీ (బిజెపి), మూడవ సంకీర్ణానికి వామపక్షాలు సారథ్యం వహిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ సోమవారం లోక్ సభకు ఐదు దశల ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం విదితమే. ఏప్రిల్ 16న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ మే 13న ముగుస్తుంది. ఎన్నికల ఫలితాలు మే 16 నుంచి వెలువడనారంభిస్తాయి.
అవకాశవాదంతో ఏర్పడినట్లు కనిపిస్తున్న ఆ కూటములు మూడు వేర్వేరు సిద్ధాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అవి మధ్యేవాద, అతివాద, మితవాద పార్టీలతో కూడుకున్నవిగా కనిపిస్తున్నాయి. ప్రచారం మొదలైన తరువాత ఎన్నికల ప్రచార సరళి మారిపోతుంది. ఎవరికి వారు తమ వాక్పటిమ ప్రదర్శిస్తారు. సంకీర్ణ నిర్మాణానికి సంబంధించిన గణాంకాలకు కొద్దిగా కెమిస్ట్రీ కూడా తోడవుతుంది. కుల, మత ప్రాతిపదికగా చీలిపోయిన రాజకీయ వ్యవస్థలో ఈ గణాంకాలే కీలకం అవుతున్నాయి. మూడు సంకీర్ణాల నాయకులు ఏ రాష్ట్రానికా రాష్ట్రంలో గెలుపు భాగస్వామ్యాల కోసం అన్వేషిస్తున్నారు. చిన్న చిన్న పార్టీలు ఎక్కువ సీట్ల కోసం గట్టిగా బేరసారాలు సాగిస్తున్నాయి. ఎన్నికల అనంతరం అంకెలే ప్రాధాన్యం వహిస్తాయని వాటన్నిటికీ తెలుసు.
Pages: 1 -2- -3- News Posted: 3 March, 2009
|