గురుశిష్యుల కథ..?
(వరప్రసాద్ గాలిదేవర)
హైదరాబాద్ : రాష్ట్రంలోనే ఆదర్శప్రాయులైన రాజకీయ గురుశిష్యులు వారు... ఒకటా? రెండా? దాదాపు ఇరవై సంవత్సరాలు అవిశ్రాంతంగా శిష్యరికం చేసి, శుశ్రూషతో సకల రకాల సేవలు అందించి అపర భీష్మునిలాంటి గురువును మెప్పించి ఆయన శిక్షణలో రాటుదేలిన రాజకీయ నాయకుడయ్యాడు శిష్యుడు. వందేళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా వెలగడానికి కావల్సిన యుక్తులను గురువు నేర్పితే, ఆపై అవకాశాలను అందిపుచ్చుకోడానికి అవసరమైన కిటుకులను, చిట్కాలను శిష్యుడు అనుభవంతో ఆకళింపు చేసుకున్నాడు. దాంతో గురువును మించిన శిష్యుడైపోయాడు. ఒకసారి లోక్ సభ సభ్యునిగా జాతీయ స్థాయిలో ఒక పట్టు పట్టేసి, రాష్ట్ర స్థాయిలో మంత్రిగా, అంతకు మించి వైఎస్ కు నమ్మినబంటుగా ఐదేళ్ళుగా చక్రం తిప్పేస్తున్నాడు. ఇంతకూ ఆ గురువు అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు అయితే శిష్యపరమాణువు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(సత్తిబాబు).
ఎక్కడో మారుమూల జిల్లా అయిన విజయనగరానికి చెందిన వారైనా గురుశిష్యులుగా జాతీయ స్థాయిలో ఈ ఇద్దరూ గుర్తింపు పొందారు. ఈ గురుశిష్యుల అనుబంధంలో పదవుల రాజకీయాలు బీటలు తెచ్చాయని, గురువుకు ఈసారి ఏ టిక్కట్టు రాకుండా శిష్యుడు ఏకంగా టిక్కేట్టేశాడని ప్రచారం జరిగిపోయింది. అది నిజం కూడా. సాంబశివరాజును ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన సతివాడ నియోజకవర్గం పునర్విభజనలో మాయమైపోయింది. నాలుగు మండలాలు నాలుగు నియోజకవర్గాల పరిధిలోకి పోయాయి. దాంతో ఈ కురువృద్ధునికి సీటు లేకుండా పోయింది. పోనీ ఖాళీలేమైనా ఉన్నాయా అంటే శివునికి గజపతినగరంలో మంత్రి సోదరుడు అప్పలనర్సయ్య మేకులాకూర్చున్నాడు. అప్పన్నను కాదంటే అక్కడ ఆటలు సాగవని శివునికి స్పష్టంగా తెలుసు. విజయనగరం లోక్ సభ అంటే అక్కడ ఉపఎన్నికలో హోరాహోరీ పోరులో గెలిచిన మంత్రిగారి సతీమణి ఝాన్సీలక్ష్మీ సిట్టింగ్ లో ఉన్నారు. ఈ నేపధ్యంలో మంత్రి సత్తిబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే గాని సాంబశివునికి టిక్కెట్ దక్కే అవకాశం లేకుండా పోయింది. బొత్స కుటుంబం త్యాగం చేస్తేనే అది సాధ్యం.
Pages: 1 -2- -3- News Posted: 7 March, 2009
|