'సర్వే'జనా బిజెపి నినాదం
న్యూఢిల్లీ: 'నిర్ణయాత్మకంగా' వ్యవహరించడానికి ఉత్తమ మార్గం సర్వే ద్వారా నిర్ణయం తీసుకోవడమేననేది భారతీయ జనతా పార్టీ (బిజెపి) 'దృడాభిప్రాయం'. మీడియాలో తన ఎన్నికల ప్రచారం నిర్వహించడానికై ప్రకటన సంస్థలు ఫ్రాంక్ సైమోస్, యుటోపియాలను ఎంపిక చేసుకున్న బిజెపి తన ప్రధాన నినాదాన్ని సిద్ధం చేసుకుంది. 'మజ్బూత్ నేత, నిర్ణాయక్ సర్కార్' (బలమైన నాయకుడు, నిర్ణయాత్మక ప్రభుత్వం) అనేదే ఆ నినాదం.
ఒక సర్వే ఆధారంగా బిజెపి తన నినాదానికి ఈ అంశాన్ని ఎంచుకున్నది. బలమైన నాయకుడు, నిర్ణయాత్మక ప్రభుత్వం కావాలని భారతదేశంలో అత్యధిక సంఖ్యాకులు కోరుకుంటున్నారని సర్వే సూచించింది. మన్మోహన్ సింగ్, సోనియా గాంధి కన్నా బలమైన నాయకత్వానికి ఎల్.కె. అద్వానీ ప్రతీక అని బిజెపి నిర్ణయించుకున్నది. టివి చానెల్స్, ఎఫ్ఎం రేడియో, వార్తాపత్రికలలో ఈ ప్రచారం ఈ నెల 16న మొదలవుతుంది.
2004 ఎన్నికలకు ముందు స్వర్గీయ ప్రమోద్ మహాజన్ నిర్వహించిన హైటెక్ ఎస్ఎంఎస్, ఫోన్ ప్రచారంపై సంఘ్ పరివార్ సంస్థలు కొన్ని తీవ్ర విమర్శలు చేసినప్పటికీ ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ లలో ఉధృతంగా ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బిజెపి గత నవంబర్ లో మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా సృజనాత్మక ప్రకటనల సంస్థ యుటోపియా సేవలను ఉపయోగించుకున్నది. ఇక ఫ్రాంక్ సైమోస్ సంస్థ ప్రచార విజయాలలో ఒకటి 'ఓన్లీ విమల్' ప్రచారం. రిలయన్స్ సంస్థకు ఇది ఎంత లాభం చేకూర్చిందో అందరికీ తెలిసిందే.
Pages: 1 -2- -3- News Posted: 10 March, 2009
|