బాబు మంత్రాలు-తంత్రాలు
హైదరాబాద్ : రాజకీయ చదరంగంలో పావులను కదపడంలో చతురనిగా వాసికెక్కిన చంద్రబాబు నాయుడు కొమ్ములు తిరిగిన మహామహా కమ్యూనిస్టులపై కూడా తన చాణక్యనీతిని ప్రయోగిస్తున్నారు. ఇక్కడ మాట వినకపోతే ఢిల్లీలో మీటలు తిప్పే విద్యను కనిపెట్టిన చంద్రబాబు మహాకూటమిలో భాగస్వాములైన సిపిఐ, సిపిఎం లను తన మాటకు తందానా అనేట్టు చేసుకోగలిగారు. సీట్ల సర్దుబాటు విషయంలో మంకుపట్టు పడుతున్న ఉభయ కమ్యూనిస్టులకు ముకుతాడు వేసే ఫార్ములాను చంద్రబాబు అమలు చేస్తున్నారు. కమ్యూనిస్టుల కంచుకోటల్లో తెలుగుదేశం పాగా వేసేందుకు మార్గాలను సుగమం చేసుకుంటున్నారు. పిల్లి తగువు పిల్లి తగువు కోతి తీర్చిన చందాన ఉభయ కమ్యూనిస్టులు కయ్యాలకు దిగుతున్న జిల్లాల్లో రాజీ మార్గంగా తెలుగుదేశం అభ్యర్ధులను రంగంలోకి దించడానికి అవసరమైన అనుమతులను కమ్యూనిస్టుల నుంచి చంద్రబాబు పొందటం ఈ ఎన్నికల ప్రత్యేక పరిణామంగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీతో చెలిమి చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం, కేడర్ లో రగులుతున్న అసంతృప్తి జ్వాలలను తట్టుకోలేక పోతున్న కమ్యూనిస్టులకు రాజకీయంగా పరువు దక్కించుకోడానికి చంద్రబాబు చెప్పినట్టు తలాడించక తప్పడం లేదు.
ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల ఖిల్లాగా ప్రసిద్ధి చెందింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చాకా, నైజాం ప్రభువుల కాలం చెల్లిన తరువాత ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులకు పెట్టని కోటగా మారింది. ఖమ్మం లోక్ సభ స్థానంలో కమ్యూనిస్టుల విజయం సాధిస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ సిపిఐ నాయకత్వానికి, సిపిఎం నాయకత్వానికీ మధ్య సయోధ్య లేదు. ఈసారి రెండు పార్టీల్లో ఏ ఒక్కరికి టిక్కెట్ ఇచ్చినా సిపిఐ, సిపిఎంలు ఒకరికొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించుకోరు. దాంతో మహా కూటమికి పరాభవం తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరీగ్గా ఈ అంశాన్నే రాజకీయ మాంత్రికుడు చంద్రబాబు ఒడిసి పట్టుకున్నారు. మధ్యే మార్గంగా మహాకూటమి తరఫున తెలుగుదేశంపార్టీ వ్యక్తిని ఉమ్మడి అభ్యర్ధిగా రంగంలోకి దింపాలని ప్రతిపాదన పెట్టారు. దానికి ప్రముఖ కాంట్రాక్టర్ మధుకాన్ అధినేత నామా నాగేశ్వరరావు అభ్యర్ధిత్వాన్ని సూచించారు. ప్రస్తుతం ఖమ్మంలో తమ పరిస్థితిపై ఆత్మజ్ఞానం అపారంగా ఉన్న మహాకూటమిలోని వామపక్ష మిత్రులు అనూహ్యంగా చంద్రబాబు సూచనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
Pages: 1 -2- -3- News Posted: 13 March, 2009
|