బాలయ్య భుజాలపైనే భారం
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా మోతె వద్ద రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ గాయపడడం తెలుగుదేశం పార్టీ (టిడిపి) వర్గాలను భయాందోళనలకు గురిచేసింది. దీనితో ప్రచార బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకోవడానికి బాలకృష్ణ సిద్ధపడ్డారు. బాబాయికి తోడుగా తాము కూడా ముమ్మరంగా ప్రచారం సాగిస్తామంటూ కల్యాణ్ రామ్, తారకరత్న ముందుకు వచ్చారు.
ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ కోలుకోవడానికి ఇంకా రెండు వారాలైనా పడుతుందని వైద్యులు చెప్పడంతో టిడిపి వర్గాలు నిర్ఘాంతపోయాయి. ఆరు జిల్లాలలో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించి జనాన్ని ఎంతగానో ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ మోతె పోలీస్ స్టేషన్ సమీపంలో తన కారు బోల్తా పడి క్షతగాత్రుడు కావడాన్ని పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ వార్త తెలుసుకున్న వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకుని ఆయన వీలైనంత త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇప్పటికే అనంతపురం జిల్లా హిందూపురం నుంచి తన ప్రచార యాత్రను ప్రారంభించి కర్నూలు, మహబూబ్ నగర్, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో పర్యటించిన బాలకృష్ణ వెనువెంటనే తెలంగాణ జిల్లాలలో తన యాత్రను మొదలుపెట్టాలని నిశ్చయించుకున్నారు. ఖమ్మం జిల్లాలో చివరి రోడ్ షోలో పాల్గొని రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని తెలంగాణ జిల్లాలలో పర్యటించాలని సంకల్పించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదంలో క్షతగాత్రుడు కావడంతో పార్టీ తరఫున ప్రచార బాధ్యతలను స్వీకరించి ఎన్టీఆర్ నటవారసులు తమంతట తాముగా ప్రచార యాత్రకు పూనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్న కల్యాణ్ రామ్, తారకరత్న కూడా ప్రచారం సాగించడానికి ముందుకు వచ్చారు. వారు ఈ మేరకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
Pages: 1 -2- -3- News Posted: 28 March, 2009
|