బాబుకు బ్రేకేసిన చిరు, జేపి!
హైదరాబాద్ : కర్ణుడుకి చావుకి కారణాలు వేయి అన్నట్టు అధికారాన్ని అందుకోవాలని అర్రులు చాచిన చంద్రబాబు పార్టీ ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఎన్నికల రణరంగంలోకి దూకిన ప్రజారాజ్యం పార్టీ, లోక్ సత్తా పార్టీలు మూడు దశాబ్దాల పాటు సంప్రదాయ బద్దంగా వున్న తెలుగుదేశం ఓటు బ్యాంకును కొల్లగొట్టాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కనీసం 125 స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీ చావుదెబ్బ తీసింది. అలానే లోక్ సత్తా పాతిక పైగా అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం విజయానికి గండికొట్టిందని ఫలితాల అనంతర విశ్లేషణలు రుజువు చేస్తున్నాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా లాభపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సీట్ల కంటే అధికంగా గెలుపొంద గలిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటమిలను కేవలం ఒక శాతం ఓట్ల తేడా నిర్ణయిస్తున్న నేపథ్యంలో రెండు కొత్త పార్టీలు కీలకమైన పాత్రనే పోషించాయి.
ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ప్రజారాజ్యం వల్ల దాదాపు 125 స్థానాల్లో మహాకూటమి అభ్యర్థులు గెలుపు వాకిట బొక్క బోర్లా పడ్డారు. అలానే మరో 85 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని ప్రజారాజ్యం అడ్డుకుంది. ఇంతకూ ప్రజారాజ్యం పార్టీ గెలిచిన 18 స్థానాల్లో 13 స్థానాలు కాంగ్రెస్ నుంచి కైవసం చేసుకున్నవే కావడం విశేషం. మిగిలిన వాటిలో బీజేపీ నుంచి పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గాన్ని, సీపీఐ నుంచి విజయవాడ పశ్చిమ స్థానాన్ని ప్రజారాజ్యం లాక్కోగలిగింది. ఇక మిగిలిన మూడు పునర్విభజనలో కొత్తగా ఏర్పడినవి కావడం విశేషం.
కోస్తాంధ్రా, రాయలసీమ జిల్లాల్లో ప్రజారాజ్యం పార్టీ భారీగా గండి కొట్టింది. అలాగే, చీల్చిన ఓట్ల వల్ల స్వల్ప మెజార్టీతో పలుచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులు బరిలో వుండడం వల్లనే మంత్రులు జానారెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, గల్లా అరుణ కుమారి, దామెదర రెడ్డి, సిబితా ఇంద్రారెడ్డి తదితరులు విజయం సాధించారు. ఉదాహరణకు మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేసిన చీపురుపల్లిలో ఆయనకు 60,677 ఓట్లు రాగా, టిడిపి అభ్యర్థి గద్దె బాబురావుకు 54,735 ఓట్లు వచ్చాయి. ఇక్కడి నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా బరిలోకి దిగిన రౌతు సునీతకు 16,418 ఓట్లు వచ్చాయి. ప్రజారాజ్యం అభ్యర్థి చీల్చిన ఓట్ల వల్లనే కేలవం 5,942 ఓట్లతో మంత్రి గట్టెక్కగలిగినారు.
Pages: 1 -2- -3- News Posted: 18 May, 2009
|