నల్లేరుపై నడక కాదు
హైదరాబాద్ : సినీరంగంలో ఎప్పుడూ నెంబర్ వన్ గానే ఉన్న చిరంజీవి రాజకీయాల్లో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నారు. అధికారం సంపాదించాలన్న ఆశతో రాజకీయాల్లోకి వచ్చిన పిఆర్పీ, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పోషించే పాత్ర ఏమిటన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ఈ ఐదేళ్ళలో వ్యవహరించే తీరుపైనే పిఆర్పీ భవిష్యత్తు ఏమిటన్నది ఆధారపడి ఉంటుంది. సినీగ్లామర్ పనిచేయలేదని తెలిసిపోవడంతో ఇక పూర్తి స్థాయి రాజకీయ నిర్మాణం, ఎత్తుగడతో అడుగులు వేయవలసి వుంది. ఆ పార్టీకి ఉన్న 18 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడం మరో ముఖ్య సమస్య. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, ఎత్తుగడల్లో నిష్ణాతుడైన కెసిఆర్ వంటి నాయకుడికే తన పార్టీ చీలిపోకుండా అడ్డుకోవడం అసాధ్యమయింది. ఎలాంటి రాజకీయానుభవం లేని చిరంజీవి ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. తమ పార్టీ పోరాటాలకు విరుద్ధమని చిరు గతంలోనే ప్రకటించినందున ప్రభుత్వంపై ఆ పార్టీ వ్యూహం ఎలా వుంటుందన్నది ప్రశ్న.
ఐదేళ్లూ ప్రజాఉద్యమాలు నిర్మించిన టిడిపికే ప్రజలు పట్టం కట్టకపోతే, పోరాటాలకు దూరమని ప్రకటించిన పీఆర్పీని ప్రజలు ఏవిధంగా ఆదరిస్తారో చూడాలి. పార్టీ దుస్థితికి కారణమయిన శక్తులను దూరం చేసే శక్తి అధ్యక్షుడికి లేకపోవడంతో పార్టీ పరిస్థితిలో మార్పు వుండకపోవచ్చు. అలాంటి కమర్షియల్ శక్తుల వల్లే పార్టీ ఓడిందన్న విమర్శలను దూరం చేసుకునే ప్రయత్నాలపైనే పిఆర్పీ భవితవ్యం ఆధారపడి ఉంది. బంధువులు కావాలా? పార్టీ కావాలో తేల్చుకునే సమయమిది. పార్టీకున్న`ఫ్యామిలీ కంపెనీ' ముద్రను తొలగించుకోకపోతే మనుగడ మరీ కష్టం కావచ్చు. పార్టీ నిర్మాణంలో అనుభజ్ఞుల పాత్ర నామమాత్రం కావడంతో పిఆర్పీ `ఎన్నికల పార్టీ'గా మారే ప్రమాదముంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోగా రాజకీయపార్టీగా మార్చకపోతే... వామపక్షాల మాదిరిగా మరో ఐదేళ్లకు `ఇతర పార్టీలపై ఆధారపడే పొద్దుతిరుగుడు పువ్వుగా' మారక తప్పదు.
Pages: 1 -2- -3- News Posted: 21 May, 2009
|