తగ్గిన ఉత్తరాది పట్టు
న్యూఢిల్లీ : విధాన నిర్ణాయక వ్యవస్థపై గుండెకాయ వంటి ఉత్తరాది రాష్ట్రాలు పట్టు కోల్పోయాయి. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్ పర్సన్ సోనియా గాంధి పూర్తి స్థాయి మంత్రి మండలిని ఆవిష్కరించారు. పెద్ద ఉత్తరాది రాష్ట్రాలను తోసిరాజంటూ దక్షిణ, తూర్పు, పశ్చిమ రాష్ట్రాల వైపే మంత్రి మండలి మొగ్గు ఉంది. కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి మరొక విశిష్టత ఏమంటే దళితులు, మాజీ ముఖ్యమంత్రులు అధిక సంఖ్యలో ఉండడం, ఊహించిన సంఖ్య కన్నా ముస్లింలు తక్కువగా ఉండడం.
కొత్త మంత్రి మండలిలోని 79 మంది సభ్యులలో 16 మంది మాత్రమే ఉత్తరాదిలోని ప్రధాన ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఝార్ఖండ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన వారు. 2004లో యుపిఎలో ఈ ఏడు రాష్ట్రాల నుంచి 59 మంది ఎంపిలు, 24 మంది మంత్రులు ఉన్నారు. ఇప్పుడు యుపిఎకు ఈ ఏడు రాష్ట్రాల నుంచి 65 మంది ఎంపిలు ఉన్నారు. కాని మంత్రుల సంఖ్య 16కు తగ్గిపోయింది. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్ జెడి, రామ్ విలాస్ పాశ్వాన ఎల్ జెపి మిత్రపక్షాలుగా ఉన్న క్రితంసారి వలె కాకుండా ఈసారి యుపిఎలో కాంగ్రెస్ ఎంపిలే ఎక్కువ మంది ఉన్నారు.
ఒకప్పుడు కింగ్ మేకర్ గా లేదా ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన ఉత్తర ప్రదేశ్ నుంచి ప్రప్రథమంగా క్యాబినెట్ మంత్రిగా ఒక్కరు కూడా లేరు. ఆ రాష్ట్రం నుంచి ఈసారి కాంగ్రెస్ లోక్ సభ సభ్యుల సంఖ్య 9 నుంచి 21కి పెరిగినప్పటికీ ఇలా జరగడం గమనార్హం. (ఒకప్పుడు యుపి నుంచే ప్రధానిని ఎంపిక చేసేవారు.)
క్యాబినెట్ మంత్రి పదవి లభిస్తుందని ఊహించిన సల్మాన్ ఖుర్షీద్ పేరును జాబితా విడుదలకు కొన్ని గంటల ముందు తొలగించారు. తాను మూడుసార్లుగా గెలుస్తున్నప్పటికీ తనను ఎందుకు పక్కకు తప్పిస్తున్నారని ఎంపి, మాజీ మంత్రి శ్రీ ప్రకాశ్ జైస్వాల్ బాహాటంగానే ప్రశ్నించడం ఇందుకు కారణం. ఇక పార్టీలోనే ఖుర్షీద్ వ్యతిరేకులు ఈ విషయంలో జైస్వాల్ కు బాసటగా నిలిచి తమ మాట నెగ్గించుకున్నారు. ఫలితంగా ఖుర్షీద్ ఇప్పుడు స్వతంత్రంగా బాధ్యతలు నిర్వర్తించే సహాయ మంత్రి అవుతున్నారు. 59 మంది కొత్త మంత్రులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. వారికి, క్రితం శుక్రవారం (20న) ప్రమాణ స్వీకారం చేసిన క్యాబినెట్ మంత్రులలో 13 మందికి శాఖలను గురువారం సాయంత్రం ప్రకటిస్తారు.
గతంలోని ప్రాంతీయ అసమానతలను సరిదిద్దాలన్న ఆత్రుత, ప్రత్యర్థి కులాల సమీకరణాలను దెబ్బతీయగల, ఉత్తర ప్రదేశ్ నుంచి వస్తున్న పరస్పర విరుద్ధ డిమాండ్లు కలగలిసి ఆ రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ మరింత జాగరూకతతో వ్యవహరించేట్లు చేశాయని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఒక వేళ రాహుల్ గాంధిని తరువాత మంత్రివర్గంలో చేర్చుకోవలసి వస్తే ఆ రాష్ట్రాన్ని ఒక 'స్టాండ్ బై'గా ఉంచుతున్నారని ఊహాగానాలు కూడా సాగుతున్నాయి.
Pages: 1 -2- -3- News Posted: 28 May, 2009
|