'యునీక్' ఖర్చు 3వేల కోట్లు ముంబై : దేశంలో ప్రతి పౌరునికీ ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వడానికి దాదాపు 3000 కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చు. ఇన్ఫోసిస్ మాజీ సిఇఒ నందన్ నీలేకని సారథ్యంలోని భారత విలక్షణ(యునీక్) గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడిఎఐ) వేసిన అంచనా అది. విలక్షణ ఐడి ప్రాజెక్టుకు సంబంధించిన 40 పేజీల డాక్యుమెంట్ లో ఈ వివరాలు పొందుపరిచారు. ఈ ప్రాజెక్టులో ప్రతి నివాసి వివరాల నమోదుకు రూ. 20, రూ. 25 మధ్య ఖర్చు అవుతుందని, 120 కోట్ల జనాభాకు ఐడి నంబర్లు కేటాయించడానికి మొత్తం రూ. 3000 కోట్లకు పైగా ఖర్చు కాగలదని తెలియజేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మీడియాలో వస్తున్న అంచనాలు రూ. 500 కోట్లు, రూ. 1,50,000 కోట్ల మధ్య ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ ను ఆన్ లైన్ పోర్టల్ 'వికీలీక్స్ డాట్ ఆర్గ్' లీక్ చేసింది.
'వికీపెడియాలో సెన్సార్ చేయరాని భాగంగా' తనను తాను అభివర్ణించుకునే వికీలీక్స్ సంస్థ అంతర్గత అసమ్మతివాదులు, సమాచారం వెల్లడి చేయాలనుకునే అభిలాషులు, జర్నలిస్టులు, బ్లాగర్లకు రక్షణ కల్పించడంపై దృష్టి కేంద్రీకరిస్తుంటుంది. రహస్యం అని పేర్కొన్న లేదా జన బాహుళ్యానికి అందుబాటులోకి రాకూడని డాక్యుమెంట్లను ప్రత్యేకంగా బహిర్గతం చేస్తుండే ఈ సైట్ లో ఈ సంవత్సరం పొందుపరచిన మూడవ భారతీయ పత్రం యుఐడి డాక్యుమెంట్.
ఈ ప్రాజెక్టు గురించి జనం తెలుసుకోవాలని ఉత్సుకత ప్రదర్శిస్తున్న నేపథ్యంలో యుఐడిఎఐ డాక్యుమెంట్ నుంచి ఎంతో శ్రమకోర్చి సేకరించిన సమాచారం ఈ దిగువన పొందుపరచడమైనది.
విలక్షణ ఐడి నంబర్ : దేశంలోని ప్రతి నివాసికి ఒక విలక్షణమైన (లేదా ప్రత్యేకమైన) ఐడి నంబర్ ను ప్రాధికార సంస్థ సృష్టిస్తుంది. సదరు వ్యక్తికి సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉంటాయి. ఇందులో వ్యక్తి పేరు, జన్మతేదీ, జన్మ స్థలం, లింగం, తండ్రి పేరు, తండ్రి యుఐడి నంబర్ (వయోజనులకు ఆప్షనల్), తల్లి పేరు, తల్లి యుఐడి నంబర్ (వయోజనులకు ఆప్షనల్), చిరునామా (శాశ్వతం, వర్తమానం), గడువు తేదీ, ఫోటోగ్రాఫ్, వేలిముద్రలు (మొత్తం పది వేళ్ళవి) ఉంటాయి. వేరే సమాచారం ఏదీ సేకరించరు. మతం, వర్ణం, జాతి, కులం, అటువంటి విషయాలకు సంబంధించిన సమాచారం ఏదైనా సేకరించడాన్ని యుఐడి చట్టం నిషేధిస్తున్నది. ఒకే వ్యక్తికి డూప్లికేట్ నంబర్ ను జారీ చేయరు కనుక దీనిని 'విలక్షణమైనది' (యునీక్) అని పేర్కొంటున్నారు. ఇది జీవితకాలం చెల్లుతుంది. అయితే, మధ్యమధ్యలో తాజా సమాచారం పొందుపరుస్తుంటారు. వంచన ధ్యేయంతో మరొక చోట రెండవ యుఐడి కోసం వివరాల నమోదు కోసం ఏమాత్రం ప్రయత్నించినా శిక్షార్హం అవుతుంది.
Pages: 1 -2- -3- -4- News Posted: 18 November, 2009
|