ఒకే చిత్రం, అనేక వెర్షన్లు!
న్యూఢిల్లీ: అమెరికాలో ఉంటున్న ఒక భారతీయ ప్రొఫెసర్ బాలీవుడ్ కు డబ్బులు దండుకోవడానికి అద్భుతమైన ఒక ఉపాయం చెప్పగలరు. ఇతివృత్తం ఒకటే అయినా కెమెరా కోణాల నుంచి సన్నివేశాలు, సంభాషణల వరకు దేనినైనా మార్చడం ద్వారా రకరకాల వర్షన్లను సృష్టించే ఉపాయం అది. స్టిల్ పిక్చర్లను, కదిలే బొమ్మలను మనకు కావలసిన రీతిలో మార్చుకునే టెక్నాలజీలతో కంప్యూటర్ సైంటిస్ట్ రమేష్ రస్కర్ బాలీవుడ్ వ్యక్తులతో చర్చలు జరుపుతున్నారు. దీనితో ఇండియాలో వినూత్న శ్రేణి చిత్రాలకు శ్రీకారం చుట్టవచ్చునని ఆయన ఆశ. ఆయన వాటిని 'ప్రోగ్రామబుల్ మూవీలు'గా పేర్కొంటున్నారు.
'ప్రోగ్రామబుల్ మూవీని ఒక ఇతివృత్తాన్ని వివిధ రీతులలో విభిన్న వ్యక్తులను ఆకట్టుకునే విధంగా మార్చవచ్చు' అని కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) మీడియా లాబ్ లో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన రస్కర్ సూచించారు.
నాసిక్ లో పెరిగి, పుణెలో ఇంజనీరింగ్ చదువుకున్న రస్కర్ దేనినైనా మరింత వాస్తవికంగా కనిపించే విధంగా రియల్ వరల్డ్ ఇమేజ్ లను కంప్యూటర్ గ్రాఫిక్స్ తో మిళితం చేసే సైన్స్ లో ప్రవీణుడు. దీనిని పరిశోధకులు 'ఆగ్మెంటెడ్ రియాలిటీ'గా పేర్కొంటున్నారు. 'అత్యంత అధునాతన డబ్బింగ్ వర్షన్ ను ఊహించుకోండి' అని రస్కర్ అన్నారు. ఆవిష్కృతమవుతున్న టెక్నాలజీలపై ఒక సదస్సు సందర్భంగా రస్కర్ మీడియాతో మాట్లాడారు.
సాధారణంగా డబ్బింగ్ చేసినప్పుడు, కథ చెప్పే తీరు, ఫ్రేముల వారీగా సన్నివేశాలు, కెమెరా పని యథాతథంగా ఉంటాయి. మొదట రికార్డ్ చేసిన సంభాషణల స్థానంలో సింక్రనైజ్ చేసిన సౌండ్ ట్రాక్ ను అమరుస్తారు. కాని ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న, మరింత మెరుగుపరుస్తున్న టెక్నాలజీల వల్ల సినిమాటోగ్రాఫర్లు కేవలం ఒకసారి ఒక సన్నివేశాన్ని రికార్డు చేసిన అనంతరం వివిధ రీతులలో నిర్దుష్ట సన్నివేశాలను మార్చడానికి లేదా స్పెషల్ ఎఫెక్ట్ లు ప్రవేశపెట్టడానికి చిత్ర దర్శకులకు అవకాశం కలుగుతుంది. హాస్య సన్నివేశాలను లేదా బీభత్స దృశ్యాలను చిత్రీకరిస్తున్నా సరే సినీ దర్శకులు వివిధ స్థాయిలలో థీమ్ లను ప్రదర్శించడానికి బొమ్మలతో, శబ్దంతో ఎన్ని విధాలుగానైనా ప్రయోగాలు చేయ(ఆడుకో)గలుగుతారు.
Pages: 1 -2- News Posted: 15 March, 2009
|