'స్వయంవరం' ప్రకటించిన రాఖీ
బాయ్ ఫ్రెండ్ అభిషేక్ అవస్థీని చెప్పుతో కొట్టినా, ఘాటు ముద్దులతో పెదాలు కొరికిన మికాపై నిప్పులు చెరిగినా రాఖీ సావంత్ కే చెల్లింది. ఇండియన్ రియాల్టీ టెలివిజన్ కు మకుటం 'లేని' మహారాణిగా రాఖీ చెలామణి అవుతోంది. ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉండే రాఖీ సావంత్ ఇన్నాళ్లకు తనకు పెళ్లీడు వచ్చిన విషయం గ్రహించినట్టుంది. ఆ ఆలోచన వచ్చిందే తడవు 'స్యయంవరం' ప్రకటించి అందర్నీ మరోసారి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇందుకోసం రియాల్టీ షో నిర్వహించి అందులో తనకు నచ్చిన వ్యక్తిని ఎంచుకుని మూడుముళ్లు వేయించుకుంటానని ప్రకటించింది. 'ఒక దశ వచ్చేసరికి ప్రతి అమ్మాయి తనకు నచ్చిన వరుణ్ని వివాహమాడాలని కలలు కంటుంది. నా జీవితంలోనూ ఇప్పుడు ఆ తరుణం వచ్చింది. నా చిటికెన వేలు పట్టుకుని జీవితాంతం కాపాడుకునే వ్యక్తిని కోరుకుంటున్నాను. రామాయణంలో కూడా సీత స్వయంవరంలోనే రాముడ్ని పెళ్లాడింది. నేనేందుకు అలా చేయకూడదు?' అని రాఖీ అంటోంది.
'రాఖీ కా స్యయంవరం' అనే రియాల్టీ షో ద్వారా రాఖీ తనకు నచ్చిన వరుడిని ఎంపిక చేసుకోనుంది. దీనిని ఎన్.డి.టి.వి. ఇమేజిన్ లో ప్రసారం చేయనున్నారు. రాఖీ చేయు అందుకునేందుకు దేశవ్యాప్తంగా జరిపే ఈ 'హంట్'లో 15 మంది పెళ్లికొడుకులను ఎంపిక చేసి, వారిని కొద్దిరోజులుగా పరీక్షించి విజేతగా నిల్చిన వ్యక్తిని రాఖీ వివాహమాడుతుంది. తనకు నచ్చిన వరుడు చాలా కూల్ గా, ప్రేమాభిమానులు కలవాడై ఉండాలనీ, మహిళల పట్ల గౌరవం తప్పనిసరని రాఖీ చెబుతోంది. డాన్స్ అంటే ఇష్టపడే వాడై ఉండాలని కూడా షరతు విధిస్తోంది. తానంటే జనానికి ఎంతో అభిమానమనీ, అలాంటి వారి పట్ల తన అభిమానాన్ని చాటుకునేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగమే ఈ స్వయంవరమనీ అంటోంది. 'ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు జనం కారణం. అందుకే నా జీవితంలో అత్యంత కీలకమైన ఈ ఘట్టంలో వారికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను. నేషనల్ టెలివిజన్ ద్వారా వరుణ్ని ఎంచుకోవడం కంటే ఉత్తమమైన మార్గం ఇంకోటి ఉంటుందని నేను అనుకోవడం లేదు' అంటూ తన ఆలోచనను రాఖీ సమర్ధించుకుంది. ఇది ఎంతమాత్రం 'పబ్లిక్ స్టంట్' కాదని కూడా సమర్ధించుకుంది. పబ్లిక్ లో తమ పెళ్లాలను జీన్స్ బటన్ విప్పమని చెప్పడం ప్రేమ సంకేతమని తాను అనుకోవడం లేదనీ, పేరున్న స్టార్స్ కూడా బార్బర్లుగానో, తలలు గొరుక్కోవడాల ద్వారానో పబ్లిసిటీ కోరుకుంటున్నారనీ, అందుకు భిన్నంగా తాను పబ్లిక్ గా నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే ప్రయత్నం మాత్రం నిజాయితీతో చేస్తున్నాననీ ఆమె పరోక్షంగా అక్షయ్ కుమార్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ లపై విసుర్లు విసిరింది.
Pages: 1 -2- News Posted: 9 April, 2009
|