http://www.telugupeople.com/uploads/tphome/images/2009/eenadu11.jpg' align='right' alt=''>చెన్నై: తీవ్రవాదాన్ని తీవ్రవాదంతోనే తుద ముట్టించాలనే కథాంశంతో పద్మశ్రీ కమల్ హాసన్ నటిస్తూ నిర్మించిన 'ఉన్నైపోల్ ఒరువన్' (తెలుగులో 'ఈనాడు') చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తీవ్రవాదులను అంతం చేసే ఓ సాధారణ వ్యక్తి పాత్రను ఇందులో కమల్ పోషించారు. అయితే హింసకు పాల్పడిన నేరస్థులను చంపడమే సరైన మార్గమని కమల్ ఎలా జస్టిఫై చేస్తారంటూ కోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఎస్.ఎ.భాషా అనే ఖైదీ ఆయనకు ఇటీవల రాసిన ఓ లేఖలో ఘాటుగా విమర్శించారు. కమల్ చెప్పినదే సరైనదైతే ఇది చట్టాన్ని చేతులోకి తీసుకోవడమే అవుతుందని అన్నారు. తన అభిప్రాయాలతో కూడిన లేఖను సెప్టెంబర్ 29న కమల్ కు ఆయన పంపారు.
కోయంబత్తూరు సెంట్రల్ జైలులో బాషా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 'కోయంబత్తూరు బాంబు పేలుళ్ల నిందితులుగా ఉన్న మేము హింస ఏ సమస్యకు పరిష్కారం కాదని గ్రహిస్తున్నాం. శాంతియుత విధానాల వల్లనే ఇది సాధ్యమవుతుందనే నిశ్చితాభిప్రాయంతో ఉన్నాం. ఈ తరుణంలో ఒక నటుడుగా మీరు మతవిద్వేషాలను రేకెత్తించేలా హింసాయిత పరిష్కారాలు సూచించడం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది' అని బాషా ఆ లేఖలో పేర్కొన్నారు. హిందూ మతోన్మాద వర్గాలు దేశంలో పలు మత ఘర్షణలు రేపినట్టుగా చెబుతున్న సంఘటనలను ఆయన ప్రస్తావిస్తూ, అలాంటి వర్గాలు పాల్పడుతున్న మత ఘర్షణలను కూడా సినిమాగా తీయబోతున్నారా అని సూటిగా కమల్ ను ప్రశ్నించారు.