టాలీవుడ్ 'క్రైమ్' కథలు! గ్లామర్ ప్రపంచం వెనుక గ్రామర్ మారుతోంది. మాదక ద్రవ్యాలు, మారణాయుధాలు, నకిలీ కరెన్సీ రాకెట్స్, సెక్స్ ట్రేడ్ వంటి అక్రమ కార్యకలాపాల ఉచ్చు టాలీవుడ్ పై బిగుస్తోంది. పోలీసులు కొద్దికాలంగా పలు కేసుల్లో పరిశ్రమ ప్రముఖుల ప్రమేయాన్ని అనుమానిస్తూ వచ్చారు. అయితే ఇటీవల ఎపిడ్రాన్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో 'దాదర్ ఎక్స్ ప్రెస్' చిత్ర నిర్మాత కె.వి.రావును అరెస్టు చేయడంతో వీరి అనుమానాలకు బలం చేకూరి నట్టయింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు ఏమాత్రం కష్టం పడకుండా డబ్బు సంపాదించేందుకు (ఈజీమనీ) ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు. ముఖ్యంగా డబ్బు, మహిళలతో ముడిపడిన నేరాలు టాలీవుడ్ లో పెచ్చరిల్లుతున్నట్టు సిటీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ చెబుతున్నారు. సినిమాలు తీసేందుకు అవసరమైన ఫైనాన్స్ కోసం కొందరు నిర్మాతలు చీటింగ్, ఫోర్జరీ వంటి నేరాలకు పాల్పడుతున్నారని అంటున్నారు.
పరిశ్రమలో ఒక వెలుగు వెలగాలనే తమ కలలను సాకారం చేసుకునేందుకు పరిశ్రమలోకి వచ్చిన నటీమణులు, జూనియర్ ఆర్టిస్టులను కొందరు ఫిల్మ్ మేకర్స్ ప్రలోభ పెట్టి తమ అవసరాలకు ఉపయోగించుకోవడం అనే కోణం కూడా ఉంది. ఇది గుట్టుచప్పుడు కాకుండా సాగే సెక్స్ ట్రేడ్ గా చెప్పుకోవచ్చు. ఒక సినీనటి వ్యభిచార గృహం నడుపుతూ పట్టుబడిన ఉదంతం ఆమధ్య వెలుగుచూసింది. నటి జయలక్ష్మి అలియాస్ సీమ, ఆమె తల్లి ఆది లక్ష్మిని 2009 జనవరిలో సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. జయలక్ష్మి 'సకుటుంబ సపరివార సమేతంగా', 'కుంకుమ', 'ఆయుధం', 'అధిపతి', 'మధుమాసం', 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా' వంటి పు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక చీటింగ్, ఫోర్జరీ వంటి నేరాలకు సంబంధించి పోలీస్ ఫైల్స్ లో కొందరి ప్రముఖ నటుల పేర్లు కూడా చోటుచేసుకున్నాయి. ఒక నిర్మాతను చీటింగ్ చేసిన ఆరోపణలకు సంబంధించి సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సోదరుడు ఆది శేషగిరిరావుపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు గత నవంబర్ లో కేసు నమోదు చేశారు. కృష్ణకు చెందిన పద్మాలయా స్టూడియోస్ కు 14.5 లక్షల రూపాయలను ఫైనాన్షియర్ బాబ్జి ఇచ్చారు. తన తండ్రి చనిపోయిన సమయంలో అతని సంతకాన్ని ఫోర్జరీ చేశారనీ, ఆ సినిమాను కూడా విడుదల చేశారనీ బాబ్జి తనయుడు బిఎస్ఎస్ ఆనంద్ ఆరోపించారు. బాబ్జి ఫైనాన్స్ చేసిన సినిమా టెలివిజన్ రైట్స్ ను పద్మాలయా స్టూడియోస్ అమ్ముకుందని తెలియడంతో ఆయన ఈ కేసు పెట్టారు.
Pages: 1 -2- News Posted: 27 February, 2010
|