త్వరలో నోకియా నెట్ వర్క్
న్యూఢిల్లీ: ప్రముఖ నోకియా, ఎరిక్ సన్ సెల్ ఫోన్ దిగ్గాజాలు మొబైల్ నెట్ వర్క్ సర్వీసెస్ రంగంలోకి అడుగు పెడుతున్నాయి. భారత్ లో మొబైల్ వర్చువల్ నెట్ వర్క్ ఆపరేటర్ (ఎమ్ విఎన్ఓ)లను ప్రభుత్వం అనుమతించడంతో నోకియా, ఎరిక్ సన్ లు మొబైల్ సర్వీసెస్ రంగంలో ప్రవేశించేందుకు నిర్ణయించుకున్నాయి. ఒక ఎమ్ విఎన్ఓ సంస్థ తనదైన యంత్రసామగ్రితోనే మొబైల్ సేవలను అందించాలన్న షరతులేమీ లేవు. తన బ్రాండ్ పేరుతో ఏ మొబైల్ నెట్ వర్క్ నుండైనా వినియోగదారులకు సేవలు అందించవచ్చు.
నోకియా, ఎరిక్ సన్ సంస్థలకు నెట్ వర్క్ అనుమతులు లభించినట్లయితే, అవి వాటి సాంప్రదాయక వ్యాపారాల నుండి ప్రక్కకు మళ్లినట్లే. నోకియా ప్రముఖ హ్యాండ్ సెట్ తయారీదారుడైతే, ఎరిక్ సన్ ప్రముఖ సాధనాల వెండర్ గా ప్రసిద్ధి. ఎమ్ విఎన్ఓ లకు లైసెన్సులు మంజూరు చేయాలని టెలికామ్ రెగ్యులేటరీ అథారటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. నోకియా, ఎరిక్ సన్ లతో పాటు పలు విదేశీ కంపెనీలు భారత నెట్ వర్క్ సర్వీసెస్ రంగంలోకి అడుగు పెట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికామ్ (డిఓటి) అధికారులు తెలిపారు.
సెల్ ఫోన్స్ హార్డ్ వేర్ రంగంలో దిగ్గాజాలుగా నిలిచిన నోకియా, ఎరిక్ సన్ లకు నెట్ వర్క్ సర్వీసు రంగంలో కూడా దూసుకుపోయేందుకు చాలా అవకాశాలున్నాయి. జపాన్ లో ఎమ్ విఎన్ ఓ సర్వీసులను ప్రారంభించేందుకు ఎన్ టిటి డిఓసిఓ జపాన్ కంపెనీతో నోకియా చర్చిస్తోందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. జపాన్ మార్కెట్ లో ప్రవేశించినట్లే నిరంతరాయంగా విస్తరిస్తున్న భారతీయ మొబైల్ నెట్ వర్క్ మార్కెట్లోకి కూడా ప్రవేశించాలని నోకియా ఆశఇస్తోంది. ఇదే జరిగితే మొబైల్ సెల్ వ్యవస్థ పూర్తి స్థాయి యంత్రాంగంలో నోకియా ప్రముఖ పాత్ర పోషించనుంది. అదే విధంగా ఎరిక్ సన్ కూడా తన ఎమ్ విఎన్ఓ సర్వీసుల గురించి డిఓటి అధికారులకు వివరించింది.
Pages: 1 -2- News Posted: 2 March, 2009
|