అద్వానీకి ఒరిస్సా షాక్!
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ)నుంచి వాకౌట్ చేయడం ద్వారా బిజూ జనతా దళ్ (బిజెడి) ఎల్.కె. అద్వానీ ప్రధాని పదవి ఆశలపై నీళ్ళు పోసింది. 'దురదృష్టవశాత్తు, బిజెడి, బిజెపి మధ్య సీట్ల పంపకం చర్చలు విఫలం అయ్యాయి. అందువల్ల మేము విడిగా ఎన్నికలలో పోటీ చేస్తాం' అని ఒరిస్సా ముఖ్యమంత్రి, బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ శనివారం రాత్రి తెలియజేశారు.11 సంవత్సరాలుగా కొనసాగుతున్న కూటమిని కాపాడడానికి మరొక సారి సమావేశమయ్యేందుకు తమకు వ్యవధి ఇవ్వాలన్న బిజెపి అభ్యర్థనను నవీన్ ఈ విధంగా తోసిపుచ్చారు.
ఎన్ డిఎలో బిజెపి, శివసేన తరువాత బిజెడి 11 మంది లోక్ సభ సభ్యులతో మూడవ పెద్ద పార్టీగా ఉన్నది. బిజెపికి పాత మిత్ర పక్షాలలో బిజెడి ఒకటి. కంధమాల్ లో క్రైస్తవులపై సంఘ్ పరివార్ మద్దతుదారులు దాడులు జరిపి పట్నాయక్ ప్రభుత్వానికి అపప్రథ తీసుకువచ్చిన తరువాత రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నప్పటికీ, సీట్లలో మరింత పెద్ద వాటా కోసం బిజెడి చేస్తున్న విజ్ఞప్తిపై అంగీకారం కుదరనప్పటికీ, కూటమిని కొనసాగించవచ్చునని బిజెపి శనివారం రాత్రి వరకు ధీమాతోనే ఉన్నది.
సీట్ల పంపకం వివాదం అనేది ఒక ముసుగు మాత్రమేనని, పొత్తుకు స్వస్తి చెప్పాలని పట్నాయక్ ముందే నిర్ణయించుకున్నారని ఈ పరిణామంతో దిగ్భ్రాంతికి గురైన బిజెపిలో ఉన్నత స్థాయి ప్రతినిధులు 'ది టెలిగ్రాఫ్' విలేఖరితో అన్నారు. 'ఆయన సంప్రదింపులు సాగించేందుకు సుముఖంగా లేరు. శనివారం సాయంత్రం మా మధ్యవర్తి చందన్ మిత్రా వద్ద అదే విషయాన్ని ఆయన స్పష్టంగా సూచించారు' అని బిజెపి నాయకుడు ఒకరు పేర్కొన్నారు. మరిన్ని సీట్ల కోసం తన కూటమి భాగస్వామ్య పక్షం చేస్తున్న విజ్ఞప్తిని మన్నించడానికి బిజెపి సిద్ధంగా లేదనే అభిప్రాయాన్ని ఆయన తోసిపుచ్చారు.
Pages: 1 -2- -3- -4- News Posted: 8 March, 2009
|