చిరుతో ఫ్యాన్స్ గోడు...
డ్యామేజ్ కంట్రోల్...
చిరంజీవి రాష్ట యువత అధ్యక్షుడు సి.హెచ్.వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.గణపతి, కృష్ణా జిల్లా అధ్యక్షుడు వరప్రసాద్ రెండ్రోజుల క్రితం ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం అభిమానుల్లో కలవరానికి, కలకలానికి దారితీసిందని చెప్పొచ్చు. దీంతో పార్టీలో 'డ్యామేజ్ కంట్రోల్' ఎక్సర్ సైజ్ మొదలైంది. వెంకటేశ్వరరావుతో సహా పలువురు పార్టీ నుంచి బయటకు రావడం, తదనంతర పరిణామాలను ప్రత్యర్థి రాజకీయ పార్టీలు సైతం నిశితంగా పరిశీలిస్తున్నాయి. చిరంజీవి అభిమానులుగా పాతికేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామనీ, తన కృషితో పార్టీకి గ్లామర్ ఇచ్చామనీ, అయితే ఇప్పుడు తమను బేఖాతరు చేసి కొత్తగా పార్టీ పంచన చేరిన డబ్బున్న వాళ్లు, వలసపక్షులకు ప్రాధాన్యం ఇస్తున్నారనీ సి.హెచ్.వెంకటేశ్వరరావు మీడియా ముందు వాపోయారు. ఆయన అభిమాన సంఘాల తరఫున 16 మందితో కూడిన ఓ జాబితాను ఇటీవల పార్టీకి అందజేశారు. ఇందులో అర్హులైన వారికి టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. అయితే ఆ జాబితాలోని ఒక్కరికీ కూడా టిక్కెట్లు రాలేదని సమాచారం. దీనికితోడు ఇటీవల చిరంజీవి ఏలూరులో పర్యటించినప్పుడు వెంకటేశ్వరరావుతో సహా రాష్ట్ర వ్యాప్త అభిమానులు పలువురు చిరంజీవిని కలిశారు. 'ఇప్పుడేం పెట్టకండి. తర్వాత చూస్తాం. వెళ్లిపోండి' అంటూ చిరంజీవి ముఖం చాటేశారట. ఈ పరిణామం అభిమనులకు విఘాతమైందని చెబుతున్నారు. దీనికితోడు ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఎపియుడబ్లుజి) నిర్వహించిన 'మీట్ ది ప్రెస్ 'లోనూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అభిమానులను అయోమయంలో పడేశారని చెబుతున్నారు. 'రాజకీయాలంటే వారికి అంత వ్యామోహమా? పదవులు కావాలన్నారు. రాజకీయాలు అనుబంధాలను తెంపేస్తాయని ఇప్పుడే అర్ధమైంది. వాళ్లు అంత వీక్ అయితే అవసరం లేదు' అంటూ చిరంజీవి వ్యాఖ్యానించడం అభిమానులను అంతర్మథనంలో పడేశాయి. ఇది పార్టీకీ, అభిమానుల మధ్య అగాధం ఏర్పడే పరిస్థితికి దారితీస్తున్న తరుణంలో చిరంజీవి స్యయంగా అభిమానులతో 'అర్ధరాత్రి చర్చలు' జరిపారు.
Pages: -1- 2 -3- -4- News Posted: 7 April, 2009
|