విశాఖ చేరని ఐటి
విశాఖపట్నం : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో హైదారాబాద్ తరువాత విశాఖ నగరాన్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిరర్థకం అవుతున్నాయి. విశాఖ నగరంలోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో వందలాది ఎకరాలను ఐ.టి కెంపనీలకు కారు చవకగా కట్టబెట్టింది. ఐ.టి. సెజ్ ను ఏర్పాటు చేసి, రాయితీలు కూడా కల్పించింది. వందల సంఖ్యలో విశాఖకు తరలి వస్తాయన్న ఐ.టి.కంపెనీలు సంక్షోభాన్ని సాకుగా చూపి, వెనక్కు వెళ్ళిపోతున్నాయి. విధులు ప్రారంభించిన కంపెనీలు కూడా అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేకపోయాయి. కొన్ని సంస్థలు ఉన్న ఉద్యోగులను కూడా తొలగిస్తున్నాయి. తాజాగా విశాఖ సత్యం శాఖ 170 మంది ఉద్యోగులను తొలగించింది.
విశాఖ బీచ్ రోడ్డులోని కాపులుప్పాడ వద్ద సుమారు 130 ఎకరాలను, అలాగే రుషికొండ వద్ద సుమారు 95 ఎకరాల భూమిని ఐ.టి కంపెనీలకు ప్రభుత్వం అతి తక్కువ ధరకు కేటాయించింది. ఇది కాకుండా నగరం నడిబొడ్డున సత్యం సంస్థకు సుమారు ఆరు ఎకరాలు, విప్రో సంస్థకు సుమారు ఏడు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఎకరా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలను విలువచేసే భూమిని లక్షలాది రూపాయలకు ఆయా సంస్థలకు అప్పగించింది. ఇందులో సత్యం, విప్రోతో పాటు మరొకటి, రెండు సంస్థలు మాత్రమే భవన నిర్మాణాలను పూర్తి చేశాయి. రెండేళ్ల నుంచి సత్యం కంపెనీ పనిచేస్తోంది. ఐ.టి.రంగం కుదేలవడంతో విప్రో ఇక్కడ విభాగాన్ని ప్రారంభించడానికి సాహసించలేకపోతోంది.
Pages: 1 -2- News Posted: 19 June, 2009
|