వ్యక్తిగత రుణాలు కష్టమే
రుణ నిబంధనలు మరింత కఠినం చేస్తూ ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్ డిఎఫ్ సి బ్యాంకు, కోటక్ మహీంద్ర వంటి ప్రైవేట్ బ్యాంకులు తమ రుణాల రేట్లను దాదాపు 15 శాతం నుంచి 18 శాతం వరకు తగ్గించాయి. వాటిలో కొన్ని అటువంటి రుణాలకు 25 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. వడ్డీ రేట్లు వేర్వేరు కస్టమర్లకు వేర్వేరుగా ఉంటాయి. 'రుణాల ఎగవేతలు పెరిగిపోతున్న కారణంగా, ప్రైవేట్ బ్యాంకులు పూచీకత్తు లేని రుణాల మంజూరులో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా రుణ చరిత్ర ఆధారంగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. అవన్నీ అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తున్నాయి' అని కోటక్ మహీంద్ర బ్యాంకు ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ కమలేష్ రావు తెలియజేశారు. 'పూచీకత్తులేని మా రుణాల విభాగంలో ఈ రుణాలు 2 శాతం కన్నా తక్కువగా ఉన్నాయి' అని ఆయన తెలిపారు.
కోటక్ మహీంద్ర బ్యాంకు సగటున రూ. 7.5 లక్షల మేరకు రుణాలు కోరే స్వయం ఉపాధి వర్తకులు, వేతనాలు పొందే ఉద్యోగులపై దృష్టి కేంద్రీకరిస్తున్నది. ఈ బ్యాంకు రూ. 1300 కోట్ల మేరకు పూచీకత్తు రహిత రుణాలు ఇచ్చింది. పూచీకత్తు లేని రుణాల మంజూరులో ఒకప్పుడు ఉదారంగా వ్యవహరించిన సిటీబ్యాంక్ ఇప్పుడు ప్రొఫెషనల్ డిగ్రీ, వీలైతే ఎంబిఎ, ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన స్వయం ఉపాధి రుణ గ్రహీతల దరఖాస్తులనే పరిశీలిస్తున్నదని బ్యాంకు రుణ విభాగం తెలియజేసింది. సదరు రుణ గ్రహీతకు అప్పటికే బ్యాంకులో అకౌంట్ లేదా క్రెడిట్ కార్డు ఉంటే రుణం తేలికగా మంజూరవుతుంది. ఇక హెచ్ డిఎఫ్ సి సేలరీ అకౌంట్ ను తప్పనిసరి చేయడం లేదు కాని అప్పటికే తమ బ్యాంకులో ఖాతా ఉన్నవారికి ప్రాముఖ్యం ఇస్తున్నది. బకాయి ఉన్న రుణంలో నాలుగు శాతం మేరకు ముందు ప్రీ-పేమెంట్ జరిమానాను ఈ బ్యాంకు వసూలు చేస్తున్నది.
క్రితం సంవత్సరం వరకు భారీగా వ్యక్తిగత రుణాలు మంజూరు చేస్తూ వచ్చిన ఐసిఐసిఐ బ్యాంకు పూచీకత్తులేని స్వల్ప మొత్తం రుణాల మంజూరు విధానానికి స్వస్తి చెప్పింది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో ఈ బ్యాంకుకు రావలసిన పూచీకత్తు రహిత రుణాలు రూ. 768 కోట్ల మేరకు ఉన్నాయి.
ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ వద్ద సేలరీ అకౌంట్లు ఉన్న కస్టమర్లకు మాత్రమే రుణాలు ఇవ్వజూపుతూ తమ వ్యక్తిగత రుణాల విభాగాన్ని విస్తరించుకుంటున్నాయి. అవి నగదు పంపిణీ పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఈ పద్ధతి కింద జీతాన్ని రుణ ఖాతాకు అనుసంధానిస్తారు. ప్రతి నెల రుణ కిస్తీలను జీతంలో నుంచి కట్టుకుంటారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) 12.5 నుంచి 15.5 శాతం రేటుకు రుణాలు ఇవ్వజూపుతున్నది. అయితే, వీటిని తన వద్ద సేలరీ అకౌంట్లు ఉన్నవారికే ఇస్తున్నది. 'మేము ప్రధానంగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నందున మాకు ఎగవేత రేట్లు బాగా తక్కువే' అని బ్యాంకు అధికారి ఒకరు చెప్పారు. క్రితం సంవత్సరం నుంచి 16 శాతం వృద్ధి పొందిన అనంతరం ఎస్ బిఐ వ్యక్తిగత రుణాల పోర్ట్ ఫోలియో రూ. 37,358 కోట్ల మేర ఉంది. ఇప్పటికే అకౌంట్లు ఉన్న కస్టమర్లు, సంపన్న వర్గాలపై బ్యాంకు దృష్టి కేంద్రీకరిస్తున్నది.
Pages: -1- 2 News Posted: 26 August, 2009
|