హోమ్ లోన్ మరింత తేలిక
న్యూఢిల్లీ : ఇంటి కోసం రుణం తీసుకోవాలని అభిలషించేవారు ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు కొన్నిటి నుంచి ఇంటి ఖరీదులో పెద్ద మొత్తాన్నే రుణంగా తీసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ)తో సహా కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్ బిలు) ఇంటి రుణం పొందడానికి కావలసిన మార్జిన్ మనీని తగ్గించాయి. ఇటువంటి సౌకర్యాన్ని కల్పిస్తున్న ఇతర బ్యాంకులలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్ బి), పుణె కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బిఒఎం) కూడా ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాను ఇప్పుడు అమలు జరుపుతున్న ప్రత్యేక ఇంటి రుణ పథకంలో భాగంగా ఇంటి రుణాలకు కావలసిన మార్జిన్ మనీని పూర్వపు 25 శాతం నుంచి 20 శాతానికి తగ్గించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ దీనిని 15 శాతానికి తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా దీనిని 15 శాతానికి తగ్గించింది. పిఎన్ బి, బిఒఎం రెండూ ఇంతకుముందు 25 శాతం మార్జిన్ మనీ ఉండాలని రుణ గ్రహీతలను కోరేవి.
ఇఁటి రుణాలకు మార్జిన్ మనీని పిఎన్ బి 15 రోజుల క్రితం సవరించగా ఎస్ బిఐ దాదాపు నెల క్రితమే దీనిని తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అయితే రెండు నెలల క్రితం ఈ మార్జిన్ మనీని తగ్గించింది. మార్జిన్ మనీ తగ్గింపు వల్ల పిఎన్ బి కస్టమర్ రూ. 20 లక్షలు విలువ చేసే ఇంటిని కొనుగోలు చేయడానికి రూ. 3 లక్షల మేరకు మాత్రమే సొంత డబ్బును చెల్లించవలసి ఉంటుంది. అతను ఇంతకు ముందు రూ. 5 లక్షలు చెల్లించవలసి వచ్చేది. అదే ధరకు ఇంటిని కొనుగోలు చేయడానికి కస్టమర్ ఎస్ బిఐ విషయంలో రూ. 4 లక్షలు, బిఒఎం విషయంలో రూ. 3 లక్షలు చెల్లించవలసి ఉంటుంది.
ఇంటి రుణాలకు తాను కేటాయించిన మొత్తాన్ని ఎస్ బిఐ జూన్ నెలాఖరుకు రూ. 3450 కోట్ల మేరకు రూ. 57,513 కోట్లకు హెచ్చించింది. బిఒఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంత వరకు రూ. 500 కోట్ల మేరకు ఇంటి రుణాలను పంపిణీ చేసింది. ప్రైవేట్ రంగంలోని ప్రముఖ ఇంటి రుణ సహాయ సంస్థలలో హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్ డిఎఫ్ సి) ఇంటి ధరలో గరిష్ఠంగా 85 శాతం వరకు రుణంగా ఇస్తుండగా ఐసిఐసిఐ బ్యాంకు 80 శాతం వరకు రుణం అందజేస్తున్నది. అయితే, ఇంటి రుణానికి కావలసిన మార్జిన్ మనీని ఈ రెండు బ్యాంకులు ఇటీవల తగ్గించాయా అనేది నిర్థారణ కాలేదు.
Pages: 1 -2- News Posted: 31 August, 2009
|