హోమ్ లోన్ మరింత తేలిక
క్రితం సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆర్థిక మాంద్యం నెలకొన్న సమయంలో చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ముందు జాగ్రత్త చర్యగా ఇంటి రుణాలకు సంబంధించి చెల్లించవలసిన మార్జిన్ మనీ మొత్తాలను హెచ్చించాయి. అయితే, ఆర్థిక వ్యవస్థలు శీఘ్రంగానే కుదుటపడుతున్న సూచనలు గోచరిస్తుండడంతో బ్యాంకులు ఈ మార్జిన్ మనీ విషయంలో సంక్షోభం ముందు స్థాయిలను తిరిగి అనుసరిస్తున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కూడా పుష్కలంగా అందుబాటులో ఉండడం కూడా బ్యాంకులను ఇందుకు పురికొల్పింది.
ఈ విధమైన మార్జిన్ మనీని తగ్గించడంతో పాటు ఎస్ బిఐ నేతృత్వంలో చాలా వరకు బ్యాంకులు తొలి సంవత్సరాలలో తక్కువ వడ్డీ రేట్లను ఇవ్వజూపుతూ ప్రత్యేక ఇంటి రుణ పథకాలను ప్రవేశపెట్టాయి. ఎస్ బిఐ మొదటి సంవత్సరం 8 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుండగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అదే కాలానికి 8.5 శాతం వసూలు చేస్తున్నది.
'మౌలికంగా ఇంటి రుణాల కోసం డిమాండ్ ను సృష్టించడానికే మార్జిన్ మనీని మా బ్యాంకుతో సహా చాలా బ్యాంకులు తగ్గించాయి. రుణం అందజేసే ముందు మేము తగినంత జాగ్రత్తలు తీసుకుంటున్నందున పెక్కు బ్యాంకులు ఈ విషయంలో రుణానికి అర్హులైన కస్టమర్లకు సాయం చేయాలని అభిలషిస్తున్నాయి' అని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అలెన్ పెరైరా తెలియజేశారు.
పెరైరా అభిప్రాయంతో పిఎన్ బి చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్.పి. అగర్వాల్ ఏకీభవించారు. 'మామూలుగా ప్రతి సంవత్సరం పండుగల సీజన్ ప్రారంభంలో రీటైల్ విభాగంలో వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గిస్తుంటాయి. పండుగల సీజన్ లో మా రుణ పథకాలలో వడ్డీ రేట్లను, మార్జిన్ రేట్లను తగ్గించడానికి బ్యాంకింగ్ వ్యవస్థలో తగినంతగా ద్రవ్యం అందుబాటులో ఉండడం ఒక కారణం' అని అగర్వాల్ వివరించారు.
Pages: -1- 2 News Posted: 31 August, 2009
|