ఇన్ ఫ్రా కంపెనీలకు దెబ్బ?
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం రాష్ట్రంలోని ఏ ఇతర సంస్థల కన్నా మౌలిక వసతుల కల్పన (ఇన్ ఫ్రాస్ట్రక్చర్) సంస్థలపై ఎక్కువ ప్రభావం చూపవచ్చు. రాజశేఖరరెడ్డి హయాం మౌలిక వసతుల అభివృద్ధికి పేరొందింది. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, కృష్ణపట్నం, గంగవరం వంటి ఆధునిక రేవులు, ప్రత్యేక ఆర్థిక మండలాల (ఎస్ఇజడ్ ల) వృద్ధి, ఉత్పాదక యూనిట్ల స్థాపన వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆయన ప్రభుత్వం చేపట్టింది. రూ. 12,132 కోట్లు వ్యయమయ్యే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ వైఎస్ రూపకల్పన చేసిందే.
అపాచె, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, కైజెన్ టెక్నాలజీస్, ఎన్ టిపిసి - భెల్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చాయంటే ఆయన ఘనతే. గడచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై రూ. 41 వేల కోట్లు ఖర్చు చేసింది. వీటి కారణంగానే రాజశేఖరరెడ్డిని 'అపర భగీరథుడు'గా కీర్తించేవారు. వైఎస్ జలయజ్ఞం కార్యక్రమాన్ని కొనసాగించడం ఆయన వారసునికి బృహత్ కార్యమే కాగలదు. ఈ పథకం కింద లక్షా 76 వేల కోట్ల రూపాయల ఖర్చుతో 84 ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించవలసి ఉంది.
రామలింగరాజు ఏర్పాటు చేసిన, ఇటీవలే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ స్వాధీనం చేసుకున్న మేటాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, నాగార్జున కన్ స్ట్రక్షన్ కంపెనీ, ఇందూ ప్రాజెక్ట్స్, నవయుగ ఇంజనీరింగ్, గాయత్రి ప్రాజెక్ట్స్ తో సహా రాష్ట్రంలో ప్రధాన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థలన్నీ రాజశేఖరరెడ్డి కార్యక్రమాల వల్ల లబ్ధి పొందినవే. ఆయన వారసులు అదే ఊపుతో ఆ పథకాలను కొనసాగించకపోతే అవి నష్టానికి గురి కాగలవు. చివరకు అరబిందో, హెటిరో డ్రగ్స్ వంటి ఔషధ సంస్థలు కూడా రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన 54 ఎస్ఇజడ్ వల్ల ప్రయోజనం పొందాయి.
వాస్తవానికి రైతు జన బాంధవుడుగా పేరు పొందిన రాజశేఖరరెడ్డి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు నాయుడు నుంచి 2004లో అధికార పగ్గాలు స్వీకరించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో పరిశ్రమలకు గల సన్నిహిత సంబంధాలు దెబ్బ తింటాయేమోననే ఆందోళన వ్యక్తమైంది. కాని గ్రామీణాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారాను, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఆయకట్టు ప్రాంతాన్ని విస్తరించడం ద్వారాను వైఎస్ఆర్ ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కొనసాగించారు. చంద్రబాబు నాయుడు వలె రాజశేఖరరెడ్డి కూడా పారిశ్రామికవేత్తలతో సత్సంబంధాలను కొనసాగించారు. అయితే, తెలుగు దేశం పార్టీ (టిడిపి) హయాంలో వలె ఈ విషయంలో ఆర్భాటం మాత్రం లేదు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని రాజశేఖరరెడ్డి అభివృద్ధి చేశారు.
Pages: 1 -2- News Posted: 5 September, 2009
|