జీతం తగ్గించుకున్న ముఖేష్
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముఖేష్ అంబానీ తన వేతనంలో 66 శాతం కోత విధించుకున్నారు. తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లకు 'విపరీత స్థాయిలో' వేతనాలు చెల్లించడం మానివేయాలని కంపెనీలకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సలహా ఇచ్చిన పది రోజుల తరువాత ముఖేష్ ఈ చర్య తీసుకున్నారు. 2008 - 09 సంవత్సరానికి అంబానీ మొత్తం వేతన ప్యాకేజి రూ. 15 కోట్లకు తగ్గిపోగలదు. ఇంతకుముందు సంవత్సరం ఈ వేతనం రూ. 44.02 కోట్లుగా ఉంది.
'ఎగ్జిక్యూటివ్ వేతనాల తగ్గింపు విషయంలో స్వయంగా ఉదాహరణగా నిలవాలన్న ఆకాంక్షను' సంస్థ అధినేత వ్యక్తం చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలియజేసింది. కంపెనీల ఎగ్జిక్యూటివ్ ల వేతనాల విషయంలో పొదుపు పాటించవలసిన ఆవశకత గురించి 2007లో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తొలిసారిగా ప్రస్తావన తీసుకురాగా తరువాత అనేక మంది ఈ మేరకు కోరనారంభించారు. వాటికి ముఖేష్ ఈ విధంగా స్పందించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు పారితోషికం కమిటీ ఇటీవల సమావేశమై ముఖేష్ అంబానీ ఆకాంక్ష మేరకు ఆయన వేతన ప్యాకేజీని రూ. 15 కోట్లకు పరిమితం చేయాలని నిశ్చయించింది. ఇకమీదట రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థలఓ ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ ల వేతన ప్యాకేజీలకు 'గరిష్ఠ పరిమితి విధానం' అనుసరించాలని కూడా కమిటీ నిర్ణయించింది.
1956 నాటి కంపెనీల చట్టం ప్రకారం ఏ కంపెనీలోనైనా టాప్ మేనేజర్ కు - ఈకేసులో ముఖేష్ అంబానీకి - కంపెనీ నికర లాభాలలో 5 శాతం వరకు చెల్లించవచ్చు. అగ్రశ్రేణి మేనేజర్లకు చెల్లించే మొత్తం పారితోషికానికి నికర లాభాలలో 10 శాతం గరిష్ఠ పరిమితి విధించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులు 2008 ఏప్రిల్ లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)గా ముఖేష్ అంబానీ పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాలు పొడిగించారు. ఆయనకు రూ. 5 లక్షలు నెల జీతం, అదనంగా రూ. 4 లక్షల మేరకు భత్యాలను చెల్లించాలనే ప్రతిపాదనకు కూడా వారు ఆమోదం తెలిపారు. అంతేకాకుండా నికర లాభాలలో కమిషన్ కు, బోర్డు సమావేశాలకు హాజరైనందుకు ఫీజుకు కూడా ఆయన అర్హుడు. ఈ లెక్కలన్నిటినీ 5 శాతం గరిష్ఠ పరిమితిలో భాగం చేశారు.
ఇకమీదట ఆర్ఐఎల్ లో పారితోషికాన్ని నికర లాభాలలో శాతం ప్రాతిపదికగా నిర్ణయించరు. పారితోషికం పరిమితి సదరు సంవత్సరపు సంస్థ పని తీరుపై ఆధారపడి ఉంటుంది. ఇది ఎగ్జిక్యూటివ్ పాత్రను ప్రతిఫలిస్తుంది. ఇది 'మరింత మెరుగ్గా పనిచేసేందుకు ప్రేరణగా ఉంటుంది, అప్పటికీ తగిన పరిమితిలోనే ఉంటుంది' అని సంస్థ తన ప్రకటనలో పేర్కొన్నది.
Pages: 1 -2- News Posted: 16 October, 2009
|