వణికిస్తున్న 'స్పెక్ట్రమ్'
న్యూఢిల్లీ : స్పెక్ట్రమ్ ఉచ్చులో చిక్కుకున్న వారంతా గడగడలాడుతున్నారు. ఏకంగా 60 వేలు కోట్ల రూపాయలు విలువ చేసే స్పెక్ట్రమ్ కుంభకోణంపై సిబిఐ సాగిస్తున్న దర్యాప్తు విషయమై ఎవరికీ అనుమానాలు తలెత్తవలసిన అవసరం లేదు. ఎందుకంటే సిబిఐ కూలంకషంగా, పక్కాగా దర్యాప్తు నిర్వహిస్తున్నది. ఈ దర్యాప్తు పరిధిలో టెలికమ్యూనికేషన్ల శాఖ (డిఒటి - డాట్)అధికారులూ, 'నామమాత్రపు' ధరలకు 2జి టెలికామ్ లైసెన్సు పొందిన అన్ని ప్రైవేట్ టెలికామ్ సంస్థలూ కూడా ఉన్నాయి.
సిబిఐ దెబ్బతో కొన్ని రోజులుగా న్యూఢిల్లీలోని సంచార్ భవన్ లో మామూలు కార్యకలాపాలు నిలచిపోయినట్లు తెలుస్తున్నది. సిబిఐ కార్యాలయాలలో అనేక గంటల పాటు ప్రశ్నించడానికి డిఒటి సీనియర్, జూనియర్ అధికారులను అనేక మందిని నిలబెట్టేయడమే ఇందుకు కారణం. డిఒటి వర్గాల సమాచారం ప్రకారం, తొమ్మిది కంపెనీలకు లైసెన్స్ జారీకి, స్పెక్ట్రమ్ కేటాయింపునకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్ళను సిబిఐ స్వాధీనం చేసుకన్నది. 2008 జనవరి 10న ఆ తొమ్మిది కంపెనీలకు 120 అనుమతి పత్రాలు (ఎల్ఒటి) జారీ అయ్యాయి.
స్పెక్ట్రమ్ కేటాయింపునకు బాధ్యత వహించే వైర్ లెస్ ప్లానింగ్ సెల్ (డబ్ల్యుపిసి)కు, యూనిఫైడ్ ఏక్సెస్ సర్వీసెస్ లైసెన్స్ (యుఎఎస్ఎల్)ల వ్యవహారాలు చూసే ఏక్సెస్ సర్వీసెస్ విభాగానికి చెందినవి ఈ ఫైళ్లు. ఏక్సెస్ సర్వీసెస్ విభాగానికి చెందిన ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డిడిజి)లను, డేటా సర్వీసెస్ విభాగానికి చెందిన ఒక డిడిజిని ప్రశ్నించే నిమిత్తం సిబిఐ పిలిపించింది. ఇంకా ఏక్సెస్ సర్వీసెస్ విభాగంలో డైరెక్టర్లను, డబ్ల్యుపిసిలో ఆఫీసర్లను కూడా ప్రశ్నించే నిమిత్తం సిబిఐ పిలిపించింది.
Pages: 1 -2- News Posted: 31 October, 2009
|