భారత్ తొలి మ్యాచ్ బంగ్లాతో ముంబై : 2011 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో తొలి మ్యాచ్ లో ఇండియా ఫిబ్రవరి 19న ఢాకాలో ఆతిథేయ జట్టు బంగ్లాదేశ్ తో తలపడుతుంది. ఇది ఇండియాకు ప్రతీకారం తీర్చుకునే మ్యాచ్ కావచ్చు. క్రితం సారి వెస్టిండీస్ లో ప్రపంచ కప్ టోర్నీ జరిగినప్పుడు ఇండియాపై బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో సంచలనాత్మక విజయం సాధించింది. ఆ ఓటమే చివరకు ఇండియా టోర్నమెంట్ నుంచి ముందుగా నిష్క్రమించడానికి కారణం కూడా అయిన విషయం విదితమే. అందువల్ మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని భారత జట్టు ఈసారి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూస్తుండవచ్చు.
వర్తమాన చాంపియన్, గత మూడుసార్లు కప్ విజేత అయిన ఆస్ట్రేలియా గ్రూప్ 'ఎ'లో స్థానం పొందింది. ఆసీస్ జట్టు తమ తొలి పోటీని ఫిబ్రవరి 21న అహ్మదాబాద్ లో జింబాబ్వేతో ఆడుతుంది. 43 రోజుల పాటు సాగే ఈ టోర్నమెంట్ లో మొత్తం 49 మ్యాచ్ లు జరుగుతాయి. భద్రతా కారణాలపై పాకిస్తాన్ ను దక్షిణాసియాలో కప్ ఆతిథ్య దేశాల జాబితా నుంచి తప్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్ణయించడంతో ఈ టోర్నమెంట్ లో మ్యాచ్ లను ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య తిరిగి సర్దుబాటు చేయవలసి వచ్చింది.
ఇండియా ఎనిమిది వేదికలో 29 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇస్తుంది. వీటిలో భాగంగా ముంబై వాంఖెడే స్టేడియంలో ఫైనల్, మొహాలిలో ఒక సెమీ ఫైనల్, అహ్మదాబాద్ లో ఒక క్వార్టర్ ఫైనల్ జరుగుతాయి. శ్రీలంక ఒక క్వార్టర్ ఫైనల్, కొలంబోలో ఒక సెమీ ఫైనల్ తో సహా మూడు వేదికలలో 12 మ్యాచ్ లను నిర్వహిస్తుంది. టోర్నమెంట్ ప్రారంభోత్సవ వేడుకలు ఫిబ్రవరి 17న ఢాకాలో జరుగుతాయి. ఢాకాలో తొలి మ్యాచ్ తో పాటు రెండు క్వార్టర్ ఫైనల్స్, ఆరు గ్రూపు మ్యాచ్ లు నిర్వహిస్తారు.
Pages: 1 -2- -3- News Posted: 10 November, 2009
|