వారసుని వేటలో టాటా
ముంబయి : ఉప్పునైనా... ఉక్కునైనా ఒక్కలాగే అమ్మేయగలరా? ఆ చాతుర్యం మీ సొంతమా? అయితే ప్రపంచంలోనే పెద్ద పారిశ్రామిక, వ్యాపార గ్రూపు కంపెనీలకు అధిపతయ్యే అవకాశం మీ ముంగిట ఉన్నట్టే... వెంటనే మీ రెజ్యూమేను రతన్ టాటాకు పంపించేయండి. రతన్ టాటాకు వారసుడు కావాలి. అతి పెద్ద సంస్థను సమర్ధవంతంగా నడిపే నాయకుడు కావాలి. భారతీయుడైతే మంచిది. విదేశీయుడైనా ఫర్వాలేదు. లక్ష రూపాయల నానో కారుతో దేశంలో సంచలనం సృష్టించిన టాటా కంపెనీ అధినేత రతన్ టాటా తన వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ విషయాన్ని స్వయంగా రతన్ టాటా(71) వాల్ స్ట్రీట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది బుధవారం నాటి సంచికలో ప్రచురితమైంది.
టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా పవర్ వంటి 27 లిస్టెడ్ కంపెనీలు ఉన్న గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సారధ్యం వహించగల వ్యక్తి కోసం దేశ, విదేశీ అభ్యర్ధులను గురించి వెతుకుతున్నామని ఆయన వెల్లడించారు. ఇరవై సంవత్సరాల పాటు టాటా గ్రూప్ ను నడిపిన రతన్ మాట్లాడుతూ ' నాకు వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించాం. ప్రస్తుతానికి బయటి నుంచి సలహాదారులు ఉన్నారు. సాధారణ ఎంపిక ప్రక్రియ సాగుతోంది. ఎలాంటి పరిమితులు లేవని' అన్నారు. వారసుడు తమ గ్రూపు నుంచైనా, బయట నుంచైనా ఎంపిక కావచ్చన్నారు. ఆ వ్యక్తి గ్రూపును అభివృద్ధి పథంలో నడిపేవాడు కావాలన్నారు. ఇంతవరకూ టాటా కుటుంబం నుంచే చైర్మన్లు అయ్యారు. కానీ రతన్ కు వారసునిగా కుటుంబసభ్యులెవరి పేరూ ఇంతవరకూ ప్రచారంలోకి రాలేదు.
Pages: 1 -2- News Posted: 18 November, 2009
|