'ఒకే ఒక్కడు' సెహ్వాగ్ ముంబయి : వీరేంద్ర సెహ్వాగ్ 284 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ఊహించలేని మూడువందలకు కేవలం 16 పరుగుల దూరంలో ఉన్నాడు. అతను శుక్రవారం ఉదయం ఆ పరుగులు కూడా చేసేస్తే? ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంతవరకూ ఏ బ్యాట్స్ మన్ సాధించలేని మూడు ట్రిపిల్ సెంచరీలు చేసిన ఘనతను సొంతం చేసుకుంటాడు.
దిమ్మతిరిగిపోయే ఈ విన్యాసాన్ని పూర్తి చేశాడనుకుందాం.... ఒక్క క్షణం ఆగి ఒకే ఒక్క చిన్న ప్రశ్న వేసుకుందాం. మనం, క్రికెట్ ప్రేమికులుగా మనం... అతనికి అర్హమైన గౌరవాన్ని ఇస్తున్నామా?
సెహ్వాగ్ గంటల తరబడి క్రీజులో నిలబడి విజృంభించి ఇలాంటి పరుగుల వరద పారించినప్పుడు చాలా అలంకారాలు వాడేస్తాం. 'వీరబాదుడు', 'విధ్వంసకరం' ఇత్యాది వర్ణనలతో పొగిడేస్తాం. ఈ ఉపమాలంకారాలు అసలు నిజాన్ని పాతేస్తూ ఉంటాయి. ఈ నజాఫ్ ఘడ్ నవాబు క్రికెట్ మేధావని, ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో అత్యత్తమ బ్యాట్స్ మన్ అన్న వాస్తవాన్ని ఈ పొగడ్తల అగడ్తల కింద దాచేస్తున్నాం.
ఊహించండి. ముత్తయ మురళీధరన్ ను గల్లీ స్థాయి బౌలర్ గా మార్చడం సాధ్యమా? ఒక రోజు కంటే తక్కువ సమయం ఆటలో ట్రిపిల్ సెంచరీ సాధ్యమా? తాను ఎదుర్కొన్న మూడు బంతులనూ సిక్సర్లు కొట్టడం సాధ్యమా?( ఈ సంవత్సరం ఆరంభంలో న్యూజిలాండ్ పర్యటనను గుర్తు చేసుకొండి). ఒక భారత బ్యాట్స్ మన్ న్యూజిలాండ్ గడ్డమీద అతివేగవంతమైన సెంచరీ చేయడం సాధ్యమా? అలాంటి అసాధ్యాలను సెహ్వాగ్ సాధ్యాలుగా మార్చివేశాడు. ఇన్ని నిజాల దృశ్యాలు కళ్ళముందు ఉన్నాయి కాబట్టే క్రికెట్ దేశాలు అతన్ని చూసి గజగజ వణుకుతున్నాయి.
రెండు ట్రిపిల్ సెంచరీలు చేసి ఇంకా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ ఉన్న బ్యాట్స్ మెన్ సెహ్వాగ్ ఒక్కడే. ఆ రెండు ట్రిపిల్ సెంచరీలు కూడా ఊపిరితీయని వేగంతో చేసినవే. అదీ అరవీర భయంకరమైన బౌలింగ్ వనరులున్న పాకిస్తాన్, దక్షిణ ఆఫ్రికా జట్లపై సాధించినవే. ఇంకో ముఖ్య విషయం. ప్రపంచ క్రికెట్ లో మరే ఇతర బ్యాట్స్ మన్ కంటే 'భారీ' ఇన్నింగ్స్ ఆడగల దమ్మున్న ఆటగాడు సెహ్వాగే. అతను చేసిన గత 13 సెంచరీల్లో 12 సెంచరీలు 150 పైగా పరుగులు చేసినవే. తాజా 284 నాటౌట్, 131, 210 నాటౌట్, 319, 151, 180, 254, 201, 173, 164, 155, 309, 195 ఇవీ అతని సత్తాకు తిరుగులేని రుజువులు. వీటిలో ఒక్కటి కూడా బంగ్లాదేశ్ మీదో జింబ్వాబ్వే మీదో చేసింది కాదు.
Pages: 1 -2- -3- News Posted: 3 December, 2009
|