'ఒకే ఒక్కడు' సెహ్వాగ్ ఒక్కటి మినహా మిగతా అన్ని స్కోర్ల స్ట్రయిక్ రేట్ 70 కి పై మాటే. టెస్ట్ క్రికెట్ స్థాయినే విస్మయపరిచే అంశం ఇది. గతేడాది దక్షిణాఫ్రికాపై చెన్నైలో చేసిన 319 పరుగులను కేవలం 304 బంతుల్లో సాధించాడు. స్ట్రయిక్ రేట్ విషయంలో చెప్పుకుంటే సర్ డొనాల్డ్ బ్రాడ్ మన్ కూడా ఇంత గొప్పగా ఆడలేదు.
ఎలాంటి మైదానంలోనైనా రాణించే బ్యాట్స్ మన్ నిజమైన ప్రతిభాశాలని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తన జీవిత చరిత్రలో రాసుకున్నాడు. తన కాలంలో ఆడిన ప్రతిభాశాలిగా వివియన్ రిచర్డ్స్ ను పేర్కొన్నాడు. ఎందుకంటే రిచర్డ్స్ మిగతా బ్యాట్స్ మన్ కంటే బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు కాబట్టే.
నిశ్చయంగా సెహ్వాగ్ కూడా అంతే. తన ఆధిపత్యంతో ఆట తీరునే మార్చివేయగలడు. బౌలర్లలో భయాన్ని నింపివేస్తాడు. ప్రపంచ స్థాయి బౌలర్లను నిస్సహాయ స్థితిలోకి తోసేయగలడు. ఇటీవల కాలంలో అన్నిరకాల క్రికెట్ ఆటలో ఇలాంటి స్థితిని బౌలర్లకు కల్పించిన బ్యాట్స్ మన్ ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కడే... అతనే సెహ్వాగ్. రెండు వందల వన్డేలు ఆడిన తరువాత కూడా స్ట్రయిక్ రేట్ ను వందకు పైగా ఉంచగల సామర్ధ్యం సెహ్వాగ్ ఒక్కడికే సాధ్యమైంది. 211 వన్డే మ్యాచ్ లు ఆడిన సెహ్వాగ్ స్ట్రయిక్ రేట్ 102.09 మరి. కానీ పరుగుల సరాసరి సెహ్వాగ్ స్థాయికి తగ్గట్టుగా లేదు. అది కేవలం 33.98 మాత్రమే. అయితే అతని గత ఇరవై మ్యాచ్ ల సరాసరి పరుగులు యాభైకి మాటే. ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో అతని వైఫల్యం ఈ సరాసరిని దెబ్బతీసింది.
మరి సెహ్వాగ్ ను ప్రత్యేకంగా నిలిపిందేమిటి? అతని స్ట్రయిక్ రేటా? బంతిని అలవోకగా బౌండరీకి పంపే నైపుణ్యమా? వాస్తవానికి అతనిదైన శైలి. క్రికెట్ పండితులు రాసిన పుస్తకాల్లో షాట్లు, నియమాలు గుడ్డిగా అనుసరించని అతని తెగింపు. తనకు ఏది నప్పుతుందో దానిని అనుసరిస్తాడు. తన సొంతమైన విశిష్ట క్రికెట్ వ్యాకరణాన్ని సృష్టిస్తాడు. శిరస్సు స్థిరంగా ఉంటుంది. కాళ్ళు కదలవు(ఫుట్ వర్కు లేదని గగ్గోలు?) కానీ కళ్ళు మెరుపు వేగంతో ఉంటాయి. చేతికి, శరీరానికి మధ్య అద్భుతమైన సమన్వయం. అంతకు మించి ఎనలేని ఆత్మ విశ్వాసం. పరిస్థితి ఏదైనా కావచ్చు. అతను తనదైన బాణీని వదులుకోడు.
Pages: -1- 2 -3- News Posted: 3 December, 2009
|