'అంబానీలూ రాజీకి రండి'
న్యూఢిల్లీ : అంబానీ సోదరుల మధ్య గ్యాస్ వివాదంలో తన పాత్రపై ఎటువంటి ఊహాగానాలకూ తావివ్వకుండా కేంద్రం జాగ్రత్త పడుతోంది. తమ మధ్య వైమనస్యాలకు స్వస్తి చెప్పి, గ్యాస్ సరఫరాపై సామరస్యపూర్వక పరిష్కారానికి రావలసిందిగా అంబానీ సోదరులు ముఖేష్, అనిల్ లకు తాను పదే పదే సలహా ఇస్తున్నట్లు ప్రభుత్వం గురువారం సుప్రీం కోర్టుకు తెలియజేసింది.
'ఇది వారిద్దరి మధ్య పోరు. వివాదాలను పరిష్కరించుకోవలసిందిగా మేము వారిని తరచు కోరుతున్నాం. ఏమైనా వారు పరిశ్రమ ప్రముఖులు కదా' అని సొలిసిటర్ జనరల్ (ఎస్ జి) గోపాల్ సుబ్రహ్మణ్యం సుప్రీం కోర్టుకు తెలియజేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నుంచి చౌక ధరలకు గ్యాస్ సరఫరా కోసం జాతీయ థర్మల్ విద్యుత్ సంస్థ (ఎన్ టిపిసి) బొంబాయి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పుతో నిమిత్తం లేకుండా ఆ ప్రభుత్వ రంగ సంస్థ (పిఎస్ యు) ప్రయోజనాల పరిరక్షణకు కేంద్రం చేయగలిగినదంతా చేస్తుందని కోర్టుకు ఆయన స్పష్టంగా తెలియజేశారు.
అంబానీ సోదరుల మధ్య శాంతి నెలకొనేట్లు చూడాలన్న ప్రభుత్వ ఆత్రుతపై కొంత కాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి. చివరకు ప్రధాని కార్యాలయం (పిఎంఒ), ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా వారిద్దరికీ సలహా ఇచ్చే విషయంలో ఏదో ఒక పాత్ర పోషించవచ్చుననే సూచనలు కూడా వెలువడ్డాయి.
Pages: 1 -2- News Posted: 4 December, 2009
|