ఇప్పుడు టాటాల 'స్వచ్ఛ్'
ముంబై : నానో తరువాత 'స్వచ్ఛ్' అన్నిటినీ తోసిరాజనబోతున్నదా? గ్రామీణ భారతాన్ని అమితంగా కుదిపివేస్తున్న సమస్యలలో ఒకటైన స్వచ్ఛమైన తాగునీటి కొరతను తీర్చడానికి టాటా గ్రూపు నడుం కట్టింది.
'స్వచ్ఛ్' పేరిట ఒక నీటి శుద్ధి పరికరం (వాటర్ ప్యూరిఫయర్)ను టాటా కెమికల్స్ సంస్థ సోమవారం ముంబైలో ఆవిష్కరించింది. దీని ఖరీదు వెయ్యి రూపాయల లోపే ఉంటుంది. గ్రామీణ భారతంలో అధిక డిమాండ్ ఉండే అవకాశాన్ని, ప్యూరిఫయర్ మార్కెట్ లో ముమ్మరంగా ఉన్న పోటీని పరిగణనలోకి తీసుకుంటే సరసమైన ధరకు లభించే 'స్వచ్ఛ్' సంచలనం సృష్టించడం ఖాయం. ఈ పరికరం తయారీకి నానోటెక్నాలజీని ఉపయోగించారు.
గ్రామీణ ప్రాంతాల జనాభాలో 75 శాతం మందికి స్వచ్ఛమైన తాగు నీరు లభించడం లేదని, ఫలితంగా నీటి సంబంధిత వ్యాధులు ప్రబలుతున్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. టాటా స్వచ్ఛ్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని టాటా గ్రూప్ లక్ష్యం. టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఈ పరికరం ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ, 'నీటి కాలుష్యం వల్ల సామాజికంగా కలుగుతున్న అనర్థం ఇప్పటికే తీవ్రస్థాయిలో ఉంది. ఇది ఏటా పెరుగుతోంది. ఇది (టాటా స్వచ్ఛ్) వ్యాధుల నిరోధంలో తనదైన ముద్రను వేయగలదని నా ఆశ' అని చెప్పారు. ఒక స్వచ్ఛ్ పరికరం నుంచి కొద్దిగా నీటిని తాగిన తరువాత టాటా చమత్కారపూర్వక స్వరంతో 'నేను ఇంకా నిలబడే ఉన్నందుకు' చాలా ఆనందంగా ఉందని అన్నారు.
Pages: 1 -2- News Posted: 8 December, 2009
|