ప్రాణం పోసిన తల్లి ప్రేమ
సోమవారం ఠాణె వాసి విజయా బపత్ సర్జికల్ మాస్క్ ధరించే తనకు లభించిన ప్రత్యేక 'కానుక' గురించి మాట్లాడారు. 'నాకు రెండు కిడ్నీలూ కుంచించుకు పోయినట్లు రెండేళ్ల క్రితం వైద్య పరీక్షలో వెల్లడైంది. నా క్రియేటినైన్ (కిడ్నీ పాడైపోయినట్లు సూచించే రక్తరసి) స్థాయి అప్పుడప్పుడు 6, 7.5కు పెరుగుతున్నాయి' అని ఆమె తెలిపారు. కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని ఆమెకు సలహా ఇచ్చారు. ఆమె భర్త ఆనంద్ బపత్ ఒక కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. 'కాని మా రక్తం గ్రూపులు వేర్వేరు కనుక ఆయన అలా దానం చేయలేకపోయారు' అని ఆమె చెప్పారు.
ఆమె ఇబ్బందిని గ్రహించిన ఆమె తల్లి శైలజా జోషి తన కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. 'నాకు తన కిడ్నీని దానం చేస్తానని మా అమ్మగారు గడచిన రెండేళ్లుగా చెబుతున్నారు. కాని నాకు అది ఇష్టం లేకపోయింది' అని బపత్ తెలిపారు. కడవర్ దాత కోసం ప్రయత్నించాలని ఆమె భావించారు. కాని కడవర్ (మెదడు మృతసదృశమైన) దాత కోసం 'నిరీక్షణ సుదీర్ఘం కావచ్చు' కనుక అలా చేయవద్దని ఆమె తల్లి సూచించారు. 'మా అమ్మగారు దృఢచిత్తురాలు. ఆమె నాకు ఇచ్చిన కానుకకు కృతజ్ఞతలు చెప్పడానికి నాకు మాటలే చాలడం లేదు' అని బపత్ పేర్కొన్నారు.
తల్లీ కూతుళ్లు ఎంతో నచ్చజెప్పిన మీదట డాక్టర్ దేశ్ పాండే నేతృత్వంలోని జస్లోక్ ఆసుపత్రి బృందం, ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ కె. దేశాయి ఈ ఆపరేషన్ కోసం శైలజా జోషిని పరీక్షించడానికి నిశ్చయించారు. 'నాకు 12, అంతకు మించిన పరీక్షలు జరిపిన తరువాత డాక్టర్లు నేను నా కిడ్నీ దానం చేయవచ్చునని సంతృప్తి చెందారు' అని జోషి చెప్పారు. ఇండియాలో అవయవ దాతల కొరతను దృష్టిలో పెట్టుకుంటే ఆరోగ్యవంతులైన వృద్ధ దాతలు ఒక మంచి ఆప్షన్ కాగలరని సూచించడమే తన ఉద్దేశమని డాక్టర్ దేశ్ పాండే చెప్పారు. 'కిడ్నీ చక్కగా ఉంటే, దాతల పూల్ ను పెంచడానికి ఇది ఒక మార్గం కాగలదు. ఏమైనా దాత కాలక్రమానుగత (క్రోనోలాజికల్) వయస్సును కాకుండా జీవన (బయోలాజికల్) వయస్సునే పరిగణనలోకి తీసుకోవాలి' అని ఆయన అన్నారు.
అయితే, ఈ విషయంలో వృద్ధులను ఆపద్ధర్మంగానే ఉపయోగించుకోవాలని పేరు వెల్లడికి ఇష్టపడని ఒక సీనియర్ డాక్టర్ అన్నారు. 'చాలా సందర్భాలలోవారు తమ కుటుంబ సభ్యులపై ఆర్థికంగా ఆధారపడి ఉంటున్నారు. అవయవ దానానికి వారిని భావోద్వేగంతోనే పురికొల్పారని నిర్థారించేందుకు అవకాశం ఏమాత్రం లేదు' అని ఆయన పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 8 December, 2009
|