నానో ధర పెరగదు
న్యూఢిల్లీ : నానో కారును బుక్ చేసుకున్న వారికి ప్రస్తుత ధరలకే పంపిణీ చేస్తామని, ముడి వస్తువుల ధరలు పెరిగినప్పటికీ కారు ధర పెంచబోమని టాటా మోటార్స్ సంస్థ స్పష్టంగా ప్రకటించింది. 'ఇదివరకే చెప్పిన ధరకు ఈ బుకింగ్ ల ప్రకారం కార్లను అందజేస్తాం. ప్రస్తుత బుకింగ్ లను పూర్తి చేయడానికి మాకు ఇంకా చాలా కాలం పడుతుంది. అందువల్ల నానో ధరలు పెంచే విషయం మాట్లాడడం ఇప్పుడు తొందరపాటే అవుతుంది' అని టాటా మోటార్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ ఎం. తెలంగ్ వివరించారు. అయితే, ఇతర మోడల్స్ ధరలు పెంచే విషయాన్ని సంస్థ ఆలోచిస్తున్నదా అనే ప్రశ్నకు తెలంగ్ స్పష్టంగా సమాధానం ఇవ్వలేదు. 'స్టీల్, టైర్ల ధరలు పెరుగుతున్నాయి. ఉత్పత్తిదారులంతా దాని గురించి ఆలోచించవలసి ఉంటుంది. మేము పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. ఇప్పుడు దీని గురించి వ్యాఖ్యానించడం కష్టం' అని ఆయన వివరించారు.
ప్రపంచంలో అత్యంత చౌక కారుగా పరిగణిస్తున్న తమ చిన్న కారు నానో కోసం 2.06 లక్షల మంది తుది దరఖాస్తుదారులలో నుంచి లక్షా 55 వేల మందికి పైగా కొనుగోలుదారులను సంస్థ గత జూన్ లో ఎంపిక చేసింది. సంస్థ మొదటి లక్ష కార్లను 2010 మార్చి లోగా పంపిణీ చేస్తుంది. మిగిలిన 55021 బుకింగ్ లను తదుపరి దశలో సంస్థ పంపిణీ చేస్తుంది. దేశంలో అత్యధిక కార్ల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ నవంబర్ వరకు 13,924 నానోలను పంపిణీ చేసింది. మొదటి లక్ష నానో యజమానులకు షోరూమ్ ధరలకే పంపిణీ జరుగుతుందని టాటా మోటార్స్ ప్రకటించింది. నానో కారు మూడు వేర్వేరు మోడల్స్ లో రూ. 1.23 లక్షలు, రూ. 1.72 లక్షలు (ఢిల్లీ షోరూమ్) ధరలకు లభ్యమవుతున్నాయి.
నానో బుకింగ్ ల రద్దు :
ఇదిలా ఉండగా, నానో కార్లను బుక్ చేసుకున్న 2.07 లక్షల మంది కస్టమర్లలో సుమారు 15 శాతం మంది తన బుకింగ్ లను రద్దు చేసుకున్నట్లు కారు డీలర్లు వెల్లడించారు. బట్వాడాకు సుదీర్ఘ సమయం పడుతున్నది. కస్టమర్లు అంతకాలం నిరీక్షించేందుకు సిద్ధంగా లేరు. టాటా మోటార్స్ సంస్థ మార్చి నెలలో నానో మార్కెట్ లో ప్రదర్శించినప్పుడు లక్ష రూపాయల కారును ఒకసారి చూసేందుకు జనం షోరూమ్ ల వద్ద ఎగబడ్డారు. తొలుత దరఖాస్తు చేసిన 2.07 లక్షల మందిలో లక్ష మందిని ఉజ్జాయింపుగా ఎంపిక చేశారు. వారికి ముందుగా నానో కార్లను పంపిణీ చేస్తారు. నానో కార్ల బట్వాడా జూలైలో మొదలైంది.
Pages: 1 -2- News Posted: 28 December, 2009
|