ఫైవ్ స్టార్ డీలా
హైదరాబాద్ : అత్యంత ఆర్భాటంగా నూతన సంవత్సరం 2010కి స్వాగతం పలకడం కోసం వినయ్ సూరి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని ఫైవ్ స్టార్ హోటళ్లు, రిసార్ట్ లు థీమ్ పార్టీ పథకాలను ప్రకటిస్తున్నప్పటికీ, హోటల్ ను బుక్ చేసుకునే ఉద్దేశం సూరికి లేదు. 'కొన్ని వారాలుగా పదేపదే బంద్ లు జరుగుతుండడంతోను, కొత్త సంవత్సరం వేడుకలను అడ్డుకుంటామనే విద్యార్ధుల తాజా బెదరింపులతోను నా భార్యతో కలసి ఈ రిస్క్ తీసుకోవాలని నేను అనుకోవడం లేదు' అని ఇటీవలే వివాహం చేసుకున్న 30 ఏళ్ల సూరి చెప్పారు.
నగరంలోని సుప్రసిద్ధ లగ్జరీ హోటళ్లలో నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై తెలంగాణ ఉద్యమం నీలి నీడలు ప్రసరిస్తున్నాయి. కొత్త సంవత్సరం స్వాగత సంరంభం కోసం డిజెలు, మ్యూజీషియన్లు, డాన్సర్లను సిద్ధం చేసుకున్నాయి. ఈ వేడుకలకు అంతరాయం కలిగిస్తామని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఒయు) విద్యార్థులు హెచ్చరించారు. వారి ఈ హెచ్చరికతో నగరంలోని హోటలియర్లకు నిద్ర పట్టడం లేదు. ఆతిథ్య పరిశ్రమకు అత్యధికంగా ఆదాయం సమకూర్చే కార్యక్రమాలలో ఒకటిగా నూతన సంవత్సరం స్వాగత సంరంభాన్ని పరిగణిస్తుంటారు.
క్రితం సంవత్సరంతో పోలిస్తే కొత్త సంవత్సరం పార్టీల కోసం ఫైవ్ స్టార్ హోటళ్ల బుకింగ్ లు అంత ప్రోత్సాహకరంగా లేవు. బుకింగ్ లు తక్కువ కావడం వల్ల వచ్చే నష్టాలతో పాటు హోటళ్లు ఆ పార్టీలను ఏదైనా కారణంతో చివరి క్షణంలో రద్దు చేస్తే సెలబ్రిటీ సింగర్లకు, డ్యాన్సర్లకు, ఇతర కళాకారులకు ముందుగా చెల్లించిన మొత్తాలను కూడా నష్టపోతాయి.
మారియట్ గ్రూపును ఈవిషయమై సంప్రదించినప్పుడు ఆ సంస్థ ఎఫ్ అండ్ బి డైరెక్టర్ అనిమేష్ బరత్ నగర పోలీస్ కమిషనర్ తో సమావేశం నుంచి అప్పుడే బయటకు వచ్చారు. 'వేడుకల విషయంలో ముందుకు సాగవలసిందని కమిషనర్ మమ్మల్ని కోరారు. పూర్తిగా అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు' అని బరత్ చెప్పారు. తమ కస్టమర్ల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా పార్టీల నుంచి పూల్ సైడ్ డిన్నర్ల వరకు తమ హోటల్ లోను, కొత్తగా ప్రారంభించిన కోర్ట్ యార్డ్ లోను వివిధ కార్యక్రమాలను మారియట్ తలపెట్టింది. ఒక భారీ పార్టీని నిర్వహిస్తున్న ఒక ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి మారియట్ తమ కన్వెన్షన్ సెంటర్ ను లీజ్ కు ఇచ్చింది. 'మా రెగ్యులర్ కస్టమర్లు, ఇతరులు మమ్మల్ని ఎంతగానో వాకబు చేస్తున్నారు. కాని ఇప్పటికీ బుకింగ్ లు ఎక్కువగా లేవు' అని బరత్ చెప్పారు. తాము విడిగా హోటల్ వద్ద భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
Pages: 1 -2- News Posted: 30 December, 2009
|