అమ్మకాల రేసులో కార్లు
న్యూఢిల్లీ : దేశంలో కార్ల అమ్మకాలు ప్రోత్సాహకరంగా సాగాయి. దేశంలో అతి పెద్ద కార్ల సంస్థ మారుతి సుజుకి వాటికి తలమానికంగా నిలిచింది. మారుతి సుజుకి అమ్మకాలు 36 శాతం మేర వృద్ధి చెందాయి. 2008 డిసెంబర్ లో 52029 మారుతి సుజుకి కార్లు అమ్ముడుపోగా 2009 డిసెంబర్ లో ఈ సంఖ్య 71 వేలకు పెరిగింది. సంవత్సరాంతపు డిస్కౌంట్లు, తక్కువ ధర ఈ సంస్థకు ప్రయోజనకరం అయ్యాయి.
మారుతి సంస్థకు చెందిన చిన్న కార్లు - ఆల్టో, వ్యాగన్-ఆర్, జెన్, స్విఫ్ట్, రిట్జ్, ఎ-స్టార్ అమ్మకాలు ఆ నెలలో 52236 మేరకు జరిగాయి. 2008లో అదే నెలలో 36831 కార్ల అమ్మకాలు జరిగాయి. ఈ పెరుగుదల 42 శాతం మేర ఉన్నది. 2009 ఏప్రిల్, డిసెంబర్ మధ్య కాలంలో అమ్మకాలు 22 శాతం మేర వృద్ధి చెందాయి. ఈ వ్యవధిలో మొత్తం 625408 కార్ల అమ్మకాలు జరిగాయి. 2008లో అదే కాలంలో అమ్మకాలు జరిగిన కార్ల సంఖ్య 510659.
మారుతి సుజుకి సమీప ప్రత్యర్థి హ్యుందై కూడా డిసెంబర్ లో 43 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. 2008 డిసెంబర్ లో 15602 హ్యుందై కార్లు అమ్ముడుపోగా 2009 డిసెంబర్ లో 22252 కార్ల అమ్మకాలు జరిగాయి. 'మొత్తం మీద ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుండడంతో భారతీయ ఆటోమోటివ్ మార్కెట్ సుస్థిరత సాధించినట్లు కనిపిస్తున్నది. అయితే, క్రితం సంవత్సరం సకాలంలో జోక్యం చేసుకున్నందుకు ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఉద్దీపన ప్యాకేజీ వల్ల ఆటోమోటివ్ పరిశ్రమకు ప్రయోజనం చేకూరింది. ప్రభుత్వం దీనిని కనీసం మరి కొంత కాలం కొనసాగిస్తుందని మేము ఆశిస్తున్నాం' అని హ్యుందై ఇండియా సంస్థ మార్కెటింగ్, సేల్స్ విభాగం డైరెక్టర్ అరవింద్ సక్సేనా పేర్కొన్నారు.
ఆటోమోటివ్ కంపెనీలు 2009 ప్రారంభంలో సంక్షుభిత పరిస్థితులు ఎదుర్కోగా, ప్రభుత్వ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు, రీటైల్ ఫైనాన్స్ రేట్ల సడలింపు, కొత్త మోడల్ కార్ల రంగ ప్రవేశం వల్ల ఈ అమ్మకాలు పుంజుకోగలిగాయి. ఆర్థిక వ్యవస్థ మెరుగుదల, ప్రభుత్వోద్యోగుల వేతనాల హెచ్చింపు, స్టాక్ మార్కెట్ రికవరీ వంటి సకారాత్మక పరిణామాల కారణంగా కొత్త వాహనాలకు డిమాండ్ విశేషంగా పెరిగింది. వరుసగా నాలుగు నెలల పాటు డిమాండ్ తగ్గిపోయిన తరువాత మోటారు వాహనాల అమ్మకాలు 2009 ఫిబ్రవరి నుంచి తిరిగి పెరగసాగాయి. ఆ ఊపు అలాగే కొనసాగింది.
Pages: 1 -2- News Posted: 2 January, 2010
|