విమాన చార్జీల్లో స్పష్టత
న్యూఢిల్లీ : విమాన టికెట్ చార్జీల్లో ఉండే అయోమయాన్ని తొలగించడానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చొరవ తీసుకుంది. ప్రకటనల్లో ఉండే టికెట్ ధర కంటే కొనేటప్పుడు రెట్టింపు ధర ఉంటుంది. దీనికి రకరకాల సర్చార్జీ, యూజర్ చార్జీల మోత కారణంగా ఉంది. ఈ పద్ధతికి స్వస్తి చెప్పాలని, అన్నీ కలుపుకున్న చార్జీనే టికెట్ ధరగా ప్రకటించాలని కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ సూచించారు. దాంతో విమాన సంస్థలు, ట్రావెల్ పోర్టల్స్ ప్రాథమిక చార్జీ, ఇంధన సర్చార్జి కలగలిపిన ఒకటే రేటును త్వరలో ప్రకటించవలసి రావచ్చు. ప్రస్తుతం విమాన సంస్థలు, పోర్టల్స్ ముందు ప్రాథమిక చార్జీని పేర్కొని, టిక్కెట్ కొన్నతరువాత ప్రభుత్వం విధించే విమానాశ్రయ, యూజర్ అభివృద్ధి చార్జీలను దానికి కలుపుతున్నాయి. విమాన సంస్థలు వసూలు చేసే ఇంధన సర్చార్జి తరచు ప్రాథమిక చార్జిని మించిపోతున్నది.
విమాన సంస్థలు, ట్రావెల్ పోర్టల్స్ ప్రాథమిక చార్జీలో ఇంధన సర్చార్జీని పొందుపరిచేట్లుగా చూడవలసిందిగా పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డిజిసిఎ)ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ కోరారు. విమానయాన రంగంపై నియంత్రణాధికారం డిజిసిఎదే. విమానాశ్రయ, యూజర్ అభివృద్ధి చార్జీలను దానిలో కలపరు. 'విమాన సంస్థలు, పోర్టల్స్ ఒక్క చార్జీని వసూలు చేసేట్లుగా చూడాలని డిజిసిఎను మంత్రి కోరారు' అని మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు తెలియజేశారు.
విమాన సంస్థలు అడ్వర్టైజ్ చేసే ప్రాథమిక చార్జీకి, టిక్కెట్ అసలు ఖరీదుకు మధ్య విస్తృత వ్యత్యాసం ఉంటున్నదని విమాన ప్రయాణికుల నుంచి తనకు ఫిర్యాదులు అందిన తరువాత పటేల్ ఈ చర్య తీసుకున్నారు. ఒక చార్జీనే ప్రకటంచవలసిందిగా డిజిసిఎ గతంలో కూడా విమాన సంస్థలను కోరింది. కాని ఫలితం లేకపోయింది. ఇప్పుడు మంత్రి స్వయంగా రంగంలోకి దిగడంతో ఎట్టకేలకు ఈ పద్ధతిలో మార్పు రావచ్చునని భావిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 18 January, 2010
|