స్వర్ణం 'మెరుపు' తగ్గింది
కోయంబత్తూరు : క్రితం సంవత్సరం ద్వితీయార్ధంలో పెట్టుబడిదారులకు మంచి లాభాలు సమకూర్చిన బంగారం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఇటిఎఫ్)లు, బంగారం ఫండ్ లు క్రమంగా తిరోగమనంలో సాగుతున్నాయి. బంగారం ధరలు తగ్గుతుండడంతో బంగారం ఇటిఎఫ్ లు, ఫండ్ ల నుంచి వచ్చే లాభాలు కూడా గడచిన రెండు నెలల్లో తగ్గుముఖం పట్టాయి. బంగారం ఇటిఎఫ్ లు 2.4 శాతం మేర తగ్గగా, బంగారం గనుల సంస్థల వాటాలలో మదుపు చేస్తుండే బంగారం ఫండ్ లు 3 శాతం నుంచి 7.8 శాతం మేర పతమనయ్యాయి.
'బంగారం ధరలు ప్రస్తుతం స్థిరీకరణ దశలో ఉన్నాయి. ఈ సరళి స్వల్ప కాలిక ప్రాతిపదికపై డాలర్ కు అనుకూలంగా ఉన్నది. అందువల్ల బంగారం విపణిలో కొంత మందకొడితనం కనిపిస్తున్నది' అని కొటక్ మహీంద్ర మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) నిర్దుష్ట ఆదాయం, ప్రాడక్ట్ ల విభాగం అధినేత్రి లక్ష్మీ అయ్యర్ పేర్కొన్నారు. డిసెంబర్ లో రికార్డు స్థాయిలో ఔన్స్ బంగారం ధర 1221.6 డాలర్ల స్థాయికి చేరుకున్న అనంతరం బంగారం ధరలు ఇప్పుడు సుమారు 1100 డాలర్ల స్థాయికి పడిపోయాయి.
బంగారం ధరలు ఇటీవల పెరిగినప్పటికీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోనారంభించింది. అంటే బంగారం కొద్దిగా మాత్రమే లాభాలు ఇవ్వగలదని విదితమవుతున్నదని బిర్లా సన్ లైఫ్ ఎంఎఫ్ సంస్థ సిఇఒ ఎ. బాలసుబ్రహ్మణ్యన్ అన్నారు. విస్తృతీకరించిన ఈక్విటీ ఎంఎఫ్ లలో అధిక భాగం, స్థూల మార్కెట్ సూచీలు మార్చి నుంచి, అంటే ప్రస్తుత పురోగమనం ప్రారంభమైన నాటి నుంచి నూరు శాతం పైగా లాభాలు సమకూర్చగా బంగారం ఇటిఎఫ్ లు ఇదే కాలంలో 6.7 శాతం నుంచి 7 శాతం మధ్య మాత్రమే లాభాలు అందజేశాయి. బంగారం ఫండ్ లు మరింత మెరుగైన ఫలితాలను ఇచ్చాయి. ఇవి 25 శాతం నుంచి 48 శాతం వరకు లాభాలను సమకూర్చాయి.
Pages: 1 -2- News Posted: 26 January, 2010
|