'ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు వెయ్యికి పైగా సిటిఎల్ఎస్ విమానాల విక్రయం జరిగింది. దీని కేటగరీలో అత్యంత భద్రమైన విమానాలలో ఇది ఒకటి' అని భారతదేశంలో ఈ విమానాన్ని మార్కెట్ చేస్తున్న స్వాంక్ ఏవియేషన్ సంస్థ సిఇఒ సంజీవ్ భాటియా తెలియజేశారు. 'మేము 150 మంది వర్ధమాన కొనుగోలుదారులను సంప్రదించాం. ఈ సంవత్సరం 12 నుంచి 20 విమానాల వరకు విక్రయించాలని మా సంకల్పం' అని ఆయన తెలిపారు.
అత్యంత చౌక విమానం 'సెస్నా సి-162' కన్నా సిటిఎల్ఎస్ ధర ఎక్కువ. దేశంలో దీని ధర సుమారు రూ. 70 లక్షలని పరిశ్రమ వర్గాల అంచనా. దేశంలో 200 సెస్నాలు ఉన్నాయి. గగన యానంలో గంటకు అయ్యే ఖర్చు పరంగా చూస్తే తమ 326 కెజి సిటిఎల్ఎస్ అత్యంత చౌక విమానమని ఫ్లైట్ డిజైన్స్ పేర్కొన్నది. ఇది ఏడాదిలో వెయ్యి గంటలు ప్రయాణిస్తే గంటకు ఖర్చు రూ. 1600 కన్నా తక్కువే ఉంటుందని సంస్థ తెలిపింది. అందరికీ అందుబాటులో ఉన్న 'లెడ్ లేని పెట్రోల్'తో ఈ విమానం ఎగరగలగడం గమనార్హం.