అన్నిటికీ ఎటిఎం!
ముంబై : ప్రస్తుతం అధిక సంఖ్యాక ఖాతాదారులు తమ అకౌంట్లను సరి చూసుకోవడానికి, డబ్బు తీసుకోవడానికి ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ఎటిఎం)లను, ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారు. కేవలం పది శాతం కన్నా తక్కువగా బ్యాంకు లావాదేవీలు బ్రాంచ్ ల ద్వారా సాగుతున్నాయి.
ఎటిఎం వాడకం పెరిగినప్పటికీ చాలా మంది కస్టమర్లు తమ ఎటిఎం సేవలను ఇంకా పూర్తిగా వినియోగించుకోవడం లేదు. బ్యాంక్ కౌంటర్ వేళలతో నిమిత్తం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరానికి ఉపయోగపడేదిగా 'ఎనీ టైమ్ మనీ' గా మారుపేరుతో పేర్కొంటున్న కాలం నుంచి ఇప్పుడు ఈ మెషీన్లు నగదు ఇచ్చేవి మాత్రమే కావు. ఇవి ఎన్నో అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. బిల్లు చెల్లింపులు, మొబైల్ రీచార్జి వంటి ఎన్నో లావాదేవీలకు ఇవి అందుబాటులోకి వచ్చాయి. దీనితో ఇంటర్నెట్ అవసరాన్ని కూడా ఇవి తగ్గిస్తున్నాయి. ఎటిఎం వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) ఇటీవలి కాలంలో బ్యాంకులకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది కూడా. ఖాతాదారులు ఎటిఎం ద్వారా ఏ సేవలు పొందవచ్చో ఈ దిగువన ఇవ్వడమైనది.
డబ్బు విత్ డ్రా చేసుకోవడం, అకౌంట్ బ్యాలెన్స్ సరిచూసుకోవడం, ఎటిఎం పిన్ మార్చుకోవడం, జారీ చేసిన చెక్కుల ప్రతిపత్తిని పర్యవేక్షించుకోవడంతో పాటు చెక్కు బుక్ కోసం అభ్యర్థన కూడా చేయవచ్చు. అకౌంట్ స్టేట్ మెంట్ కూడా పొందవచ్చు. ఇక బ్యాంకు, ఎటిఎం మెషీన్ లను బట్టి, చెక్కులు, నగదు డిపాజిట్ కూడా చేయవచ్చు. ఏ ఖాతాదారుడైనా తన ఎటిఎం-కమ్-డెబిట్ కార్డుకు అనుసంధానించిన అకౌంట్లు చాలా కలిగి ఉన్నట్లయితే, అతను డబ్బును ఈ అకౌంట్లలోకి బదలీ చేసుకోవచ్చు
బిల్లు చెల్లింపు సేవల కోసం బ్యాంకు వద్ద పేరు నమోదు చేసుకున్న తరువాత ఆ చెల్లింపు కోసం ఖాతాదారుడు తన బ్యాంకు ఎటిఎంకు వెళ్ళవచ్చు. ఇక ఎటిఎంలల ద్వారా చెల్లించదగిన యుటిలిటీ బిల్లులు బ్యాంకును బట్టి మారిపోతుంటాయి. సాధారణంగా విద్యుత్, టెలిఫోన్, మొబైల్ బిల్లులు, బీమా ప్రీమియం వీటి ద్వారా చెల్లించవచ్చు. పలు బ్యాంకు ఎటిఎంలలో ప్రీ పెయిడ్ మొబైల్ రీచార్జి సౌకర్యం కూడా ఉంటుంది. అయితే, ఎటిఎం ద్వారా సాగించే బ్యాంకింగేతర లావాదేవీలు తిరిగి బ్యాంకు, ఎటిఎంలను బట్టి మారుతుంటాయి. ఉదాహరణకు ఎంపిక చేసిన కొన్ని కాలేజీలకు ఫీజు చెల్లింపు నిమిత్తం తన ఎటిఎంలను ఉపయోగించుకోవడానికి ఖాతాదారులను ఎస్ బిఐ అనుమతిస్తుంటుంది. అదేవిధంగా వైష్ణోదేవి, శిరిడీ సాయిబాబా, తిరుపతి వంటి ఆలయాల ట్రస్టులకు విరాళాలను కూడా బ్యాంకు కస్టమర్లు ఎటిఎంల ద్వారా పంపవచ్చు.
Pages: 1 -2- News Posted: 5 February, 2010
|