కృష్ణపట్నంకు భారీ రుణం
ముంబై : ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణపట్నంలో తన నాలుగు వేల మెగావాట్ల అల్ట్రా మెగా విద్యుత్ ప్రాజెక్ట్ (యుఎంపిపి)కి పెట్టుబడి కోసం అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్ (ఆర్ పిఎల్) ఒక బ్యాంకుల కన్సార్షియం నుంచి 14 వేల కోట్ల రూపాయల మేరకు రుణం స్వీకరించనున్నది. 2013 నాటికి ఈ ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ప్రారంభించడానికి దీని వల్ల వీలు కలుగుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం పెట్టుబడి 18 వేల కోట్ల రూపాయలలో మూడింట రెండు వంతులకు పైగా ఈ కన్సార్షియం రుణం అందజేస్తుంది.
'ప్రధాన రుణదాత అయిన ఐడిబిఐ బ్యాంకు ఈ ప్రాజెక్టు కోసం రూ. 1500 కోట్లను సమకూర్చవచ్చు. రుణంలో మిగిలిన మొత్తం సిండికేట్ రూపంలో వస్తుంది. భారీ, మధ్య తరహా బ్యాంకుల విస్తృత కన్సార్షియం ఈ సిండికేషన్ లో భాగంగా ఉంటుంది. సిండికేషన్ ప్రక్రియ మొదలైంది' అని సీనియర్ బ్యాంకర్ ఒకరు తెలియజేశారు. బ్యాంకుల కన్సార్షియంలో భాగం కావడానికై ఆ బ్యాంకర్ ను కూడా ఆహ్వానించారు.
ఆర్ పిఎల్ అధిక వడ్డీ రేటు చెల్లించవలసి ఉంటుందని, ప్రాజెక్టుకు అందే నిధులను బట్టి తిరిగి చెల్లింపు జరుగుతుందని కన్సార్షియంలో చేరాలనే ఆసక్తి ఉన్న ఒక బ్యాంకర్ చెప్పారు. 15 సంవత్సరాల గడువు గల ఈ రుణంపై సుమారు 11 శాతం వడ్డీ రేటు చెల్లించవలసి ఉంటుంది. ఇది ప్రైమ్ లెండింగ్ రేట్ (పిఎల్ఆర్)తో ముడిపడి ఉంటుంది. ఒక సంవత్సరం తరువాత దీనిని తిరిగి నిర్థారిస్తారు.
Pages: 1 -2- News Posted: 8 February, 2010
|