'టాటా' సూపర్ బాస్!
ముంబై : జనరల్ మోటార్స్ యూరప్ విభాగం అధిపతి కార్ల్ పీటర్ ఫోర్ స్టర్ ను తమ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా నియమించినట్లు టాటా మోటార్స్ సంస్థ సోమవారం ప్రకటించింది. టాటా మోటార్స్ సంస్థలో ఇది కొత్త ఎగ్జిక్యూటివ్ పదవి. దేశంలోను, విదేశాలలోను టాటా మోటార్స్ కార్యకలాపాలకు ఫోర్ స్టర్ బాధ్యత వహిస్తారు. ఆయన కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు నేరుగా రిపోర్ట్ చేస్తారు. జాగ్వార్, లాండ్ రోవర్ కార్ల విభాగం బాధ్యతలు కూడా ఆయన అధికార పరిధిలో ఉన్నాయి. 'కార్ల్ పీటర్ ఫోర్ స్టర్ కొత్త సూపర్ బాస్' అని టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు.
టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా ఆపరేషన్స్) పి.ఎం. తెలంగ్ నేరుగా ఫోర్ స్టర్ కు రిపోర్టు చేస్తారు. డేవిడ్ స్మిత్ స్థానంలో జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్ఆర్) మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించే అధికారి కూడా ఫోర్ స్టర్ కు రిపోర్టు చేస్తారు. మార్చితో ముగిసిన సంవత్సరంలో అమ్మకాలు మరీ హీనంగా ఉండడంతో జనవరి ద్వితీయార్ధంలో జెఎల్ఆర్ సిఇఒగా తప్పుకున్న స్మిత్ స్థానంలో మరొకరిని టాటా మోటార్స్ ఇంకా నియమించవలసి ఉంది. రానున్న కొన్ని వారాలలో ఈ నియామకం జరగవచ్చునని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి ఒకరు సూచించారు.
టాటా మోటార్స్ సంస్థ అంతర్జాతీయంగా పెట్టుకున్న ఆశలు, విదేశీ మార్కెట్లలో వివిధ కేటగరీలలో పలు కీలక మోడల్ వాహనాలను ప్రవేశపెట్టాలనే యోచనల దృష్ట్యా విదేశీ గ్రూప్ సిఇఒను నియమించాలని టాటా సంస్థ నిర్ణయించింది. టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా ఈ నియామకంపై వ్యాఖ్యానిస్తూ, 'సిసలైన అంతర్జాతీయ సంస్థ కావాలన్న తన ఆశయాకాంక్షలను నెరవేర్చుకోవడానికి ఫోర్ స్టర్ నియామకం విశేషంగా దోహదం చేస్తుందని టాటా మోటార్స్ భావిస్తున్నది' అని తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 16 February, 2010
|