3జి వేలానికి రెడీ: రాజా
న్యూఢిల్లీ : మూడవ తరం (3 జి) స్పెక్ట్రమ్ వేలం కార్యక్రమంలో పాల్గొనే బిడ్డర్లకు ఒక వారంలోగా ఆహ్వానాలను పంపుతామని టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఎ. రాజా తెలిపారు. అయితే, ఈ ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి కాకపోవచ్చు. దీనితో స్పెక్ట్రమ్ అమ్మకం ద్వారా ఆదాయంతో ద్రవ్య లోటును భర్తీ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు గండి పడుతున్నది. స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో లోటు 16 ఏళ్లలో అత్యధిక స్థాయిలో 6.8 శాతం మేర ఉండవచ్చునని భావిస్తున్నారు.
3జి స్పెక్ట్రమ్ వేలం నుంచి రూ. 30 వేల కోట్ల నుంచి రూ. 35 కోట్ల వరకు రెవెన్యూ రావాలని ఆర్థిక మంత్రిత్వశాఖ లక్ష్యం నిర్ణయించింది. ఫిబ్రవరి నెలాఖరులోగా వేలం ప్రక్రియను పూర్తి చేయాలని టెలికమ్ శాఖకు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. 'దరఖాస్తులు కోరుతూ ఈ వారంలో నోటీస్ జారీ చేయగలం. ఆతరువాత వేలం ప్రారంభం కావడానికి 40 నుంచి 45 రోజుల వ్యవధి పడుతుంది' అని రాజా తెలియజేశారు. అయితే, ప్రభుత్వానికి ఎంత మేరకు రెవెన్యూ వస్తుందనేది ఆయన మదింపు వేయలేకపోయారు.
ఇండియా అంతటికీ లైసెన్స్ సంపాదించడానికి ఒక్కొక్క టెలికమ్ సంస్థ 1.5 బిలియన్ డాలర్ల వరకు వెచ్చించగలదని విశ్లేషకులు ఊహిస్తున్నారు. హై స్పీడ్ వైర్లెస్ నెట్ వర్క్ నిర్మాణానికి మరిన్ని బిలియన్ల డాలర్లు ఖర్చు కావచ్చునని వారు సూచిస్తున్నారు.ప్రస్తుత 2జి సర్వీస్ కన్నా అధిక వేగంతో ఇంటర్నెట్ ను బ్రౌజ్ చేయడానికి లేదా సంగీతం, వీడియో తో సహా వివిధ కార్యక్రమాలను డౌన్ లోడ్ చేసుకోవడానికి 3జి మొబైల్ ఫోన్ సర్వీస్ వల్ల వీలు కలుగుతుంది.
Pages: 1 -2- News Posted: 24 February, 2010
|