విమాన చార్జీల మోత
హైదరాబాద్ : సర్వీస్ పన్ను విధింపు, పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకం హెచ్చింపు పర్యవసానంగా విమాన చార్జీలు పది శాతం వరకు పెరగవచ్చు. అయితే, చార్జీలను ఏ మేరకు పెంచాలో దేశీయ విమాన సంస్థలు ఇంకా నిర్ణయించుకోలేదు. పది శాతం సర్వీసు పన్ను మౌలిక చార్జీలపైనా లేక తుది చార్జీలపైనా అనేది స్పష్టం కాకపోవడం ఇందుకు కారణం.
సర్వీస్ పన్ను ఉపసంహరించేట్లుగా ఆర్థిక శాఖ మంత్రికి పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ నచ్చజెప్పగలరని విమాన సంస్థలు ఆశిస్తున్నాయి. కస్టమ్స్ సుంకం హెచ్చింపును కూడా ఉపసంహరించేట్లు చూడాలని ప్రఫుల్ పటేల్ ను అవి కోరుతున్నాయి. పన్ను పూర్తిగా ఉపసంహరించకపోయినా కొంత మేరకు తగ్గించవచ్చునని ఎక్సైజ్, కస్టమ్స్ శాఖ కేంద్ర బోర్డు (సిబిఇసి) చైర్మన్ వి. శ్రీధర్ రాజధానిలో సూచించారు. 'విమాన సంస్థలతో చర్చలు ప్రారంభమయ్యాయి. మరీ అధికం కాని రేటుపై మేము ఒప్పందానికి రావచ్చు' అని రాజధానిలో సిఐఐ సమావేశం సందర్భంగా శ్రీధర్ మీడియాకు సూచించారు.
2010 - 11 బడ్జెట్ లో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై సర్వీసు పన్నును విధించారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఎటిఎఫ్) పై కస్టమ్స్ సుంకాన్ని 5 శాతం నుంచి పది శాతానికి హెచ్చించారు. పెట్రోలియం మార్కెటింగ్ సంస్థలు సోమవారం ఎటిఎఫ్ రేట్లను దాదాపు 3.5 శాతం పెంచాయి.
Pages: 1 -2- News Posted: 4 March, 2010
|