క్వార్టర్స్ లో సైనా హైదరాబాద్: భారత ఆశా కిరణం సైనా నెవాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గంటపాటు సాగిన మూడు గేమ్‌ల హోరాహోరీ పోరులో 18-21, 21-18, 21-10 తేడాతో సైనా బల్గేరియా క్రీడాకారిణి పెత్యా నెదెల్‌చెవాను ఓడించి ముందంజ వేసింది. తొలి గేమ్‌లో నెదెల్‌చెవా అద్భుతంగా పోరాడి సైనాను కంగుతినిపించగా, తర్వాత రెండు గేమ్‌లలో సైనా విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకుంది.
మ్యాచ్ ప్రారంభం నుంచే ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. ప్రారంభంలో సైనా ఆధిపత్యం కనబరిచినా ప్రత్యర్థి పెత్యా అద్భుత పోరాట పటిమతో మళ్లీ పుంజుకుంది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. దీంతో పోటీ హోరాహోరీగా సాగింది. స్కోరు 6-6 వద్ద ఉండగా సైనా విజృంభించి ఆడింది. చకచక పాయింట్లు సాధిస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. తొలి విరామం సమయానికి ఆరో సీడ్ సైనా 11-7తో కీలక ఆధిక్యాన్ని సాధించింది. తర్వాత కూడా ఆమె ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఒక దశలో సైనా 17-13 ఆధిక్యాన్ని పొందడంతో విజయం లాంఛనంగా కనిపించింది. అయితే కీలక సమయంలో ఒత్తిడికి లోనై పట్టు కోల్పోయింది. వరుస తప్పిదాలతో ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకుంది. మరోవైపు ప్రత్యర్థి పెత్యా మొక్కువోని ధైర్యంతో ఆడుతూ మళ్లీ పైచేయి సాధించింది. ఈ క్రమంలో వరుసగా 8పాయింట్లు గెలుచుకుని 21-18తో గేమ్‌ను దక్కించుకుంది. ఎదురులేని ఆధిక్యంలో ఉన్న సైనా తొలి గేమ్‌ను కోల్పోయింది.
Pages: 1 -2- -3- News Posted: 13 August, 2009
|